భద్రాచలం ఈవోపై దాడి.. సర్కారు సీరియస్.. ఏం జరిగింది?
భద్రాచలం రామాలయానికి చెందిన భూములను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పురుషోత్తపట్నం మండలంలో కొందరు గిరిజనులు, ఆదివాసులు, ఎస్సీలు ఆక్రమించుకున్నారని ఆలయానికి ఫిర్యాదులు అందాయి.
By: Tupaki Desk | 8 July 2025 10:37 PM ISTతెలంగాణలోని ప్రసిద్ధ శ్రీరామచంద్ర మూర్తి ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈవో) రమాదేవిపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె ఒక్కసారిగా నేలపై పడిపోయి.. స్పృహ కోల్పోయారు. దీంతో హుటాహుటిన ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. అయితే.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. దాడులు చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని తెలిపింది.
అసలేం జరిగింది?
భద్రాచలం రామాలయానికి చెందిన భూములను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పురుషోత్తపట్నం మండలంలో కొందరు గిరిజనులు, ఆదివాసులు, ఎస్సీలు ఆక్రమించుకున్నారని ఆలయానికి ఫిర్యాదులు అందాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు, తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఈవో రమాదేవి మంగళవారం ప్రయత్నించారు. దీనిపై గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకి దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం జరుగుతోంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న దేవాదాయ శాఖ సిబ్బందిపై ఆక్రమణదారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో గుంపులు గుంపులుగా తరలి వచ్చిన ఆక్రమణ దారులు.. అధికారులు, పోలీసులను అక్కడ నుంచి తరిమి కొట్టారు. దీంతో రమాదేవి ఆ గుంపు దాడిలో ఒక్కసారిగా కింద పడిపోయి.. స్పృహ కోల్పోయారు. భద్రాద్రి ఘటనపై మంత్రి కొండా సురేఖ సీరియస్అయ్యారు. ఈవో రమాదేవిపై భూ ఆక్రమణదారులు దాడి చేసిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు.
రామాలయం.. దేవుని భూములు కబ్జా చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసలు నమోదు చేసి జైలుకు పంపించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు వందల సంఖ్యలో పురుషోత్తపట్నంలో మోహరించారు. కానీ, ఇది ఏపీ హద్దుల్లో ఉండడంతో వారు ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.