Begin typing your search above and press return to search.

ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్... మోడీని పాములా చుట్టారు!

అవును... భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్‌ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.

By:  Raja Ch   |   31 July 2025 4:08 PM IST
ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్... మోడీని పాములా చుట్టారు!
X

భారత దిగుమతులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రెండు దేశాలను 'చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు'గా ఆయన ఎగతాళి చేశారు! రష్యాతో కలిసి భారతదేశం ఏమి చేసినా తనకు డోంట్ కేర్ అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు.

అవును... భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్‌ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. 'చనిపోయిన ఆర్థిక వ్యవస్థ' అని అభివర్ణిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనని.. ఆ విషయంలో మోడీకి తప్ప అందరికీ తెలుసని అన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ.... 'అవును.. ఆయన చెప్పింది నిజమే.. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి తప్ప ఈ విషయం అందరికీ ఇది తెలుసు.. భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అని అందరికీ తెలుసు.. ట్రంప్ ఒక వాస్తవాన్ని చెప్పినందుకు నేను సంతోషంగా ఉన్నాను.. భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అని మొత్తం ప్రపంచానికి తెలుసు" అని అన్నారు.

ఇదే సమయంలో... అదానీకి సహాయం చేయడానికి బీజేపీ, భారత ఆర్థిక వ్యవస్థను అంతం చేసిందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కోసమే పనిచేస్తున్నారని.. రాహుల్ గాంధీ ఆరోపించారు. నేడు భారతదేశం ముందు ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే... ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థ, రక్షణ, విదేశాంగ విధానాన్ని నాశనం చేయడమే అని అన్నారు!

ఇదే సమయంలో... ఆపరేషన్ సిందూర్ సమయంలో సడన్ గా సీజ్ ఫైర్ ప్రకటన రావడం, దానికి కారణం తానే అని ట్రంప్ ఇప్పటికే సుమారు 30 నుంచి 32 సార్లు ప్రకటించడంతో పాటు.. 5 జెట్‌ లు కూలిపోయాయని కూడా అన్నారని.. ఇప్పుడు 25 శాతం సుంకాలను విధిస్తానని చెబుతున్నారని.. అయినప్పటికీ మోడీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని రాహుల్ ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... ఒకవేళ ట్రంప్ అబద్ధాలు చెబుతుంటే... అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నవి అబద్ధాలని ప్రధాని మోడీ చెప్పాలని.. అలా ఎందుకు చెప్పలేకపోతున్నారని రాహుల్‌ గాంధీ మరోసారి ప్రశ్నించారు. ట్రంప్‌ మాటలు అబద్ధాలని మోడీ చెబితే.. అసలు నిజాలు బయటకొస్తాయని.. అందుకే ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారని స్పష్టమవుతోందని తెలిపారు!

మరోవైపు... భారత ప్రధాని నరేంద్ర మోడీని ట్రంప్‌ పాములా చుట్టుకున్నారని.. మోడీ ప్రస్తుతం బలహీన స్థితిలో ఉన్నారని.. చాలా విషయాలు దాచిపెడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.