ట్రంప్ ముఖాన డంప్ చేసిన ఖతార్.. విలాసవంతమైన విమానం వెనక కథ
ఖతార్ రాజకుటుంబం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747 విమానాన్ని బహుమతిగా ఇచ్చిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 16 May 2025 4:57 PM ISTఖతార్ రాజకుటుంబం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747 విమానాన్ని బహుమతిగా ఇచ్చిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇది కేవలం ఉదారమైన బహుమతి కాదని, పోషించలేని 'తెల్ల ఏనుగు' లాంటి తమ విమానాన్ని తెలివిగా వదిలించుకునే వ్యూహంలో భాగమేనని వైమానిక రంగ నిపుణులు అంటున్నారు.
ప్రపంచంలోనే సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది క్రమంగా వదిలించుకుంటోంది. ఇందులో భాగంగానే నిర్వహణ భారం మితిమీరిన 'తెల్ల ఏనుగు' లాంటి తమ బోయింగ్ 747 జంబోను, దాని ఖర్చులను భరించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తికి అప్పగించగలిగారు. ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ ఈ విమానాన్ని బహుమతిగా ఇస్తోందని కొన్ని ఊహాగానాలు వచ్చినా, ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. ఇప్పుడు తమకు అవసరం లేని ఆ విమానాన్ని ట్రంప్‌కు 'డంప్' చేయడం ద్వారా నిర్వహణ, స్టోరేజి ఖర్చులు బాగానే తగ్గుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది 'ఒక దెబ్బకు రెండు పిట్టలు' అన్నట్టుగా, ఖతార్‌కు ఖర్చు తగ్గడంతో పాటు, ట్రంప్ కూడా ఉచిత గిఫ్టుతో సంతోషిస్తున్నారు.
- విమానం వివరాలు, వ్యయ భారం
ట్రంప్‌కు బహూకరించిన ఈ విమానం టెయిల్ నంబర్ 'ఏ7-హెచ్బీజే' (A7-HBJ), ఇది ఖతార్ మాజీ ప్రధాని హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని మొదటి అక్షరాలను సూచిస్తుంది. ఈ విమానం ఖతార్ 'రాజ' విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఒకటి. 2012లో 367 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,130 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేయబడిన ఈ విమానం, కొన్న తర్వాత మూడేళ్ల పాటు వందల కోట్లు ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా మార్పులు చేశారు. సాధారణంగా 467 మంది ప్రయాణించగల బోయింగ్ 747-8లో, మార్పుల తర్వాత కేవలం 89 మంది మాత్రమే ప్రయాణించేలా హంగులు అద్దారు. ఇందులో రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు ఉన్నాయి.
అయితే, బోయింగ్ 747 సిరీస్ విమానాలను ఆపరేట్ చేయడానికి విపరీతమైన ఖర్చు అవుతుంది. 'కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్' అంచనా ప్రకారం, 747-8 వీఐపీ వెర్షన్‌ను నడపడానికి గంటకు 23 వేల డాలర్లు (దాదాపు రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. పెరుగుతున్న ఇంధన ధరలతో పాటు, ఈ భారీ వ్యయ భారం కారణంగానే గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు, ప్రభుత్వాలు, రాజకుటుంబాలు బోయింగ్ 747, ఎయిర్‌బస్ ఏ340 వంటి నాలుగు ఇంజిన్ల విమానాలను సేవల నుంచి తప్పించి, తక్కువ ఇంధనం వాడే రెండు ఇంజిన్ల బోయింగ్ 787, ఎయిర్‌బస్ ఏ350 వంటి ఆధునిక విమానాలపై ఆధారపడుతున్నాయి.
-'తెల్ల ఏనుగు'లకు తగ్గుతున్న డిమాండ్
పరిమాణంలో పెద్దవైన, అత్యంత సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం నిర్వహణ అవసరమైన, విపరీతంగా ఇంధనం తాగే ఇలాంటి పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన విమానాలకు డిమాండ్ పడిపోయిందని ఈ ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం వీటిని కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ప్రభుత్వాలు ఈ 'తెల్ల ఏనుగు'లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.
దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ బీఏఏ & పార్టనర్స్ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ మాట్లాడుతూ ఖతార్ ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థికంగా అనుకూలమైన విమానాల వైపు మొగ్గు చూపుతోందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని అప్పగించడాన్ని ఓ 'సృజనాత్మక పరిష్కార వ్యూహం'గా, 'ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు'గా ఆయన అభివర్ణించారు.
పెద్ద విమానాలకు పొడవైన రన్వేలు అవసరం కావడం, భద్రతాపరంగా అవి పెద్ద లక్ష్యాలుగా మారే ప్రమాదం వంటి కారణాల వల్ల వాటి వినియోగం పరిమితంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ట్రంప్‌కు బహూకరించిన ఖతారీ విమానం గత ఐదేళ్లలో కేవలం 1,059 గంటలు మాత్రమే ప్రయాణించింది.
ఖతార్ మాత్రమే కాదు, సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ వంటి దేశాలు కూడా క్రమంగా ఇలాంటి పెద్ద విమానాలను వదిలించుకుంటున్నాయి. గతంలో సౌదీ యువరాజు కోసం కొన్న ఓ 747-8 విమానం కేవలం 42 గంటలే ప్రయాణించి చివరకు 2022లో తుక్కు కింద ముక్కలు చేయబడింది.
-ట్రంప్‌కు సవాలేనా?
బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఈ విమానాన్ని వినియోగంలోకి తీసుకురావడం అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. భద్రతపరమైన నిబంధనల ప్రకారం ఈ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి, అవసరమైన ధృవీకరణ పొందడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని అంచనా. అంటే, ఒకవేళ ట్రంప్ తన పదవీ కాలంలో పూర్తి చేసినా ఈ విమానాన్ని వెంటనే ఉపయోగించడం కష్టమే.
మొత్తంగా చూస్తే, ఖతార్ తమకు భారం మారిన 'తెల్ల ఏనుగు' లాంటి విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చి తెలివిగా వదిలించుకుంది. ఇది ఖతార్‌కు నిర్వహణ, నిల్వ ఖర్చులను తగ్గిస్తుంది. ట్రంప్‌కు ఉచితంగా విమానం లభించినా, దాని నిర్వహణ, వినియోగం ఆయనకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కేవలం విమానం మార్పిడి కాదు, ఆధునిక విమానయానంలో మారుతున్న పోకడలకు, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత పెరుగుతున్న తీరుకు అద్దం పడుతోంది.