థియేటర్‌లో తొక్కిసలాట.. శ్రీతేజ్ డిశ్చార్జ్
తాజా సమాచారం మేరకు... చిన్నారి శ్రీతేజ్ ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 29 April 2025 9:30 PM IST'పుష్ప 2' రిలీజ్ సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంథ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె పదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4 నుంచి ఈ బాలుడు సికిందరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాటలో బాలుడి మెదడుకు డ్యామేజ్ జరగడంతో సుదీర్ఘ కాలం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని మీడియాలో కథనాలొచ్చాయి.
తాజా సమాచారం మేరకు... చిన్నారి శ్రీతేజ్ ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించారని తెలుస్తోంది. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడు. గత పదిహేను రోజులుగా లిక్విడ్స్ ని నోటి ద్వారా తీసుకుంటున్నాడు.. కానీ ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్నాడని బాలుడి తండ్రి చెబుతున్నట్టు తెలిసింది. మనుషుల్ని గుర్తు పట్టకపోయినా ప్రస్తుతం ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని తెలిపారు. శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితిని బట్టి పూర్తిగా కోలుకునేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.
థియేటర్ లో తొక్కిసలాట ఘటన అనంతరం హైదరాబాద్ లో పబ్లిక్ ఈవెంట్ల విషయంలో పోలీసుల ఆంక్షలు పెరిగాయి. సినిమా ఈవెంట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్మాతలు ప్రతిదీ పకడ్భందీగా ప్లాన్ చేయాల్సి వస్తోంది. పోలీసుల అనుమతులు తేవడానికి శ్రమించాల్సి వస్తోందని ఇన్ సైడ్ వర్గాలు తెలిపాయి.