పురందేశ్వరి వెనుకబడ్డారా.. సర్వేలు ఏం చెబుతున్నాయి.. ?
పురందేశ్వరి వెనుకబడి ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయని సర్వే సంస్థలు తెలిపాయి.
By: Tupaki Desk | 24 Jun 2025 4:00 PM ISTఏపీ బీజేపీ చీఫ్‌గానే కాకుండా.. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలిగా కూడా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి ప్రజలను మెప్పించడంలో వెనుకబడ్డారా? పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించలేక పోతున్నారా? ప్రజలకు ఆమెకు మధ్య సత్సంబంధాలు తగ్గిపోతున్నాయా? అంటే.. ఔననే అంటున్నాయి .. సర్వే సంస్థలు. తాజాగా ఏడాది పాలన ముగిసిన తర్వాత.. రాష్ట్రంలో ఎంపీల పనితీరుపై సర్వేలు జరిగాయి. వీటిలో 10వ స్థానంలో పురందేశ్వరి నిలవడం గమనార్హం.
రాష్ట్రంలో 25 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రజలకు చేరువైన వారు.. ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నవారు? నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్న వారు..? ఇలా.. అనేక కోణాల్లో సర్వే సంస్థలు ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఒక సంస్థ చేసిన సర్వేలో తొలి నుంచి 10వ స్థానంలో పురందేశ్వరి చోటు దక్కించుకున్నారు. మరో సంస్థ చేసిన సర్వేలో ఆమె 12వ స్థానంలో ఉన్నారు. సరే.. మొదటితే పరిగణనలోకి తీసుకున్నా.. ఆమె పనితీరు పుంజుకోవాల్సిన అవసరం ఉంది.
ఏంటి కారణాలు?
పురందేశ్వరి వెనుకబడి ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయని సర్వే సంస్థలు తెలిపాయి. ప్రజలకు ఆమె దూరంగా ఉంటున్నాన్నది ప్రధాన సమస్య. తాను చేయాల్సిన పనులను కూడా వదిలేసి.. అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్న ధోరణిలో ఆమె వ్యవహరిస్తున్నారన్నది మరో సమస్య. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉంటానని.. సమస్యలు పరిష్కరిస్తానని పురందేశ్వరి గతంలోనే ప్రకటించారు. కానీ, అలా అయితే.. పరిస్థితి ఇలా ఉండదుకదా! ప్రజలు ఎక్కువగా ఆమెను చూసి చాలా కాలమైందని చెబుతున్నారు.
నిజానికి రాష్ట్ర బీజేపీ పార్టీ చీఫ్‌గా ఉన్న నేపథ్యంలో పురందేశ్వరి బిజీగా ఉన్నారు. కానీ, ఆమె తన వారిని ఇక్కడ పెట్టుకుని ప్రజలకు.. ఆమెకు మధ్య సంబంధాలు తొలిగిపోకుండా చూసుకోవాలి. కానీ, ఈ ప్రయ త్నం చేయడం లేదు. పైగా ఎవరినీ ఆమె విశ్వసించడం లేదన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు రాజమండ్రిలో సమస్యలే లేవన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో.. ఈ కారణంగానే పురందేశ్వరి బాగా వెనుకబడ్డారన్నది సర్వేలు చెబుతున్న మాట. మరి ఆమె తన పద్ధతిని మార్చుకుంటారో లేదో చూడాలి.