'కాల్చిపారేస్తా' డీఎస్పీ వార్నింగ్ వైరల్
పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు టీడీపీ, వైసీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 12 Aug 2025 7:42 PM ISTమాజీ సీఎం జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అధికార, విపక్షాలు ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ ప్రారంభానికి ముందు నుంచే పులివెందులలో హైటెన్షన్ ఏర్పడింది. ఈ సందర్బంగా ముఖ్య నేతల అరెస్టులు, నిర్బంధాలతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రిగ్గింగుకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపించగా, వైసీపీయే ఓటర్లను అడ్డుకుంటోందని టీడీపీ ప్రత్యారోపణలకు దిగింది. ఇక పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకువచ్చారని, అర్హులైన ఓటర్లను ఓటు వేయనీయలేదని వైసీపీ ఆరోపిస్తూ పోలింగును అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో ఎన్నికల విధుల్లో ఉన్న డీఎస్పీ ఒకరు వైసీపీ కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు టీడీపీ, వైసీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సైతం అరెస్టు చేయగా, ఆయన కొంత సేపటి తర్వాత తన కార్యాలయానికి వచ్చారు. అయితే ఆ సమయంలో వందల మంది కార్యకర్తలు వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే భద్రత కారణాల దృష్ట్యా అవినాష్ రెడ్డి కార్యాలయాన్ని ఖాళీ చేయాలని డీఐజీ కోయ ప్రవీణ్ ఎంపీ అవినాష్ రెడ్డిని కోరారు. భారీ బందోబస్తు మధ్య ఎంపీ కార్యాలయానికి డీఐజీ ప్రవీణ్ తోపాటు పోలీసులు రాగా, వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్న డీఎస్పీ మురళీ నాయక్ వైసీపీ శ్రేణులకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ‘ఎక్స్ ట్రాలు చేస్తే కాల్చిపడేస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు తాగి మాట్లాడుతుండొచ్చు. కానీ యూనిఫాం ఉందిక్కడ అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.