4 గంటల్లోనే ప్రతిఘటన.. పక్కా ప్లానింగ్.. సాక్ష్యాలే లేకుండా జాగ్రత్తలు..
నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 8 July 2025 3:32 PM ISTనెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. కోవూరు సిటింగ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడటంతోనే దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు కూడా దాడికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దాడి చేసింది ఎవరు? దాడి ఎలా జరిగింది? దాడిలో ఎవరెవరు ఉన్నది తెలిపే ఒక్క సాక్ష్యం కూడా ఇంతవరకు లభించకపోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో దాడి జరిగిన ఒక రోజు తర్వాత కూడా దాడి సమయంలో కానీ, దాడికి ముందు ప్రసన్న ఇంటిపై దండెత్తిన మూకకు సంబంధించిన వీడియో ఒక్కటి కూడా లేకపోవడం చూస్తే పక్కా పథకం ప్రకారమే జరిగిందని అంటున్నారు.
సోమవారం రాష్ట్ర ఐటీ, మానవ వనరుల మంత్రి నారా లోకేశ్ నెల్లూరులో పర్యటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నెల్లూరు నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే లోకేశ్ పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహంతో వైసీపీకి చెందిన సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోవూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కోవూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం జరగ్గా, సరిగ్గా అదే సమయంలో మంత్రి నారా లోకేశ్ పర్యటన ముగిసిందని చెబుతున్నారు.
మంత్రి లోకేశ్ నెల్లూరు నుంచి వెళ్లిన మరుక్షణమే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు టీడీపీ నేతల దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తీవ్ర మనస్థాపానికి లోనైనట్లు చెబుతున్నారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న నెల్లూరు నగరానికి చెందిన కీలక నేతలు ఇద్దరు తమ అనుచరులను రమ్మని కబురు చేసినట్లు చెబుతున్నారు. స్థానిక నేతల ఆదేశాలతో వందల మంది కార్యకర్తలు, మహిళలు ఓ చోట చేరి దాడికి రూపకల్పన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అంతా ఒకేసారి వెళితే సమాచారం లీకవుతుందనే ఉద్దేశంతో చిన్న చిన్న బృందాలుగా విడిపోయిన టీడీపీ కార్యకర్తలు రాత్రి 9 గంటల సమయంలో సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నట్లు చెబుతున్నారు.
కోవూరు సమావేశం ముగించుకుని ప్రసన్న అప్పటికీ కూడా ఇంటికి రాకపోవడంతో అంతా మూకుమ్మడిగా దాడికి తెగబడినట్లు చెబుతున్నారు. అయితే దాడి దృశ్యాలు ఎవరికీ లభించకూడదనే ఉద్దేశంతో ముందుగా సీసీ కెమెరాలు, వాటి హార్డ్ డిస్క్ లను మాయం చేశారంటున్నారు. అనంతరం ఇంట్లో సామగ్రిని మొత్తం ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. ఈ మూక దాడితో ప్రసన్న ఇంట్లో గోడలు తప్ప మరే వస్తువులు మిగల్లేదని అంటున్నారు. ఇక దాడి సమయానికి ప్రసన్న కోవూరులోనే ఉండగా, ఇంట్లో వృద్ధురాలైన ఆయన తల్లి, ఓ పనిమనిషి మాత్రమే ఉన్నారంటున్నారు. దాడి సమయంలో కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో ఎవరు వచ్చిందీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేసినందున ఆమె అనుచరులే దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు తప్ప, ఎవరు దాడి చేశారనేది నిరూపించేలా ఇంతవరకు ఒక్క వీడియో సాక్ష్యం బయటకు రాకపోవడం గమనార్హం.
ఇక గతంలో ఇవే తరహా దాడులు రాష్ట్రంలో అక్కడక్కడా జరిగినట్లు చెబుతున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చొచ్చుకు వెళ్లడం, విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ సానుభూతిపరులు దాడి చేసి గృహోపకరణాలు ధ్వంసం చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే నాటి దాడి సమయం వీడియోలు అన్నీ క్షణాల్లో బయటకు వచ్చాయి. కానీ, ఇప్పుడు ప్రసన్న ఇంటిపై దాడి జరిగింది వాస్తవమైనా, ఎవరు దాడి చేశారో నిర్థారించే ఒక్క వీడియో కూడా లభించకుండా జాగ్రత్త పడటం చూస్తే అంతా పక్కా పథకం ప్రకారమే వ్యవహరించారని అర్థమవుతోందని అంటున్నారు.