ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. ఉగ్రవాదంపై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!
భారత సైన్యం ధైర్యసాహసాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రధాని మోదీ అన్నారు.
By: Tupaki Desk | 29 April 2025 8:57 PM ISTదేశంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో.. ముఖ్యంగా పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన దారుణ దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉగ్రమూలాలను పెకలించి వేస్తామని దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి తమ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
భారత సైన్యం ధైర్యసాహసాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రధాని మోదీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇవ్వడానికి సైన్యం సంసిద్ధంగా ఉందని, ఈ విషయంలో వారికి పూర్తి స్వాతంత్ర్యం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సైనిక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు ఎంతటి దుశ్చర్యకు పాల్పడినా, వారి ఆటలు ఇక సాగవని ఆయన హెచ్చరించారు.
దేశ ప్రజల ఐక్యతే తమకు అతిపెద్ద బలమని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రతి ఒక్క భారతీయుడు సైన్యానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనే ఉగ్రవాదుల దుష్ట ఎజెండాను ఎప్పటికీ విజయం సాధించనివ్వమని ఆయన స్పష్టం చశారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం అచంచలమైనదని ఆయన మరోసారి హెచ్చిరించారు.
గతంలోనూ దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రతిస్పందించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. సరిహద్దులు దాటి సైనిక చర్యలు చేపట్టి ఉగ్రవాదులకు దీటైన సమాధానం చెప్పామన్నారు. అదే స్ఫూర్తితో, పహల్గాం ఉగ్రదాడికి కూడా తగిన రీతిలో బదులు తీర్చుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.