మోడీ సర్.. సమాధానం చెప్పాల్సింది ప్రజలకే!
వరుస విజయాలు.. వరుసగా మూడోసారి ప్రధాని.. సుదీర్ఘ కాల రాజకీయ పార్టీ కాంగ్రెస్ రికార్డులను కూడా తోసిపుచ్చిన నాయకుడుగా ప్రధాని మోడీ పేరు జగద్వితం కావొచ్చు.
By: Garuda Media | 30 July 2025 2:08 PM IST``వరుస విజయాలు.. వరుసగా మూడోసారి ప్రధాని.. సుదీర్ఘ కాల రాజకీయ పార్టీ కాంగ్రెస్ రికార్డులను కూడా తోసిపుచ్చిన నాయకుడుగా ప్రధాని మోడీ పేరు జగద్వితం కావొచ్చు. ఆయన `విశ్వగురు`గా పేరు తెచ్చు కుని ఉండొచ్చు. కానీ.. ఇదంతా ప్రజల చేత.. ప్రజల వలన.. వచ్చిన గౌరవమే. వారిని మరిచి.. ఏకపక్షంగా వ్యవహరిస్తే.. అది మొదలుకే మోసం తెచ్చుకున్నట్టు అవుతుంది.``- ఇదీ.. బుధవారం నాటి జాతీయ మీడియాలో వచ్చిన అనేక ఎడిటోరియల్స్‌లోని సారాంశం.
దీనికి కారణం.. పార్లమెంటును బుల్డోజ్ చేయడమే. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్తావరాలపైనా.. ఉగ్రవాదు లపైనా మే 7వ తేదీ చేపట్టిన `ఆపరేషన్ సిందూర్`పై అనేక అనుమానాలు పెల్లుబికాయి. ఇవి కేవలం కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలకు తలెత్తిన సందేహాలే కాదు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ వాదులకు, సంఘ్ పెద్దలకు కూడా తలెత్తిన సందేహాలు కూడా!. ఆపరేషన్ సిందూర్ ద్వారా.. పాకిస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసి.. చివరకు పీవోకే కూడా స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చిందని సంబర పడిన.. సమయంలో అనూహ్యంగా దీనిని నిలిపివేశారు.
ఇదే అతి పెద్ద ప్రశ్న అయితే.. దీనికి అనుబంధంగా అనేక ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. వీటినే పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తాయి. కానీ, ఎప్పటిలానే.. మోడీఈ ప్రశ్నలను దాట వేశారు. 1960లలో చైనా యుద్ధంలో మీరు ఏం చేశారంటూ.. ప్రశ్నించారు. ముంబై ఉగ్రవాద దాడులకు ఎవరు బాధ్యత వహించారని ఆయన నిలదీశారు. అయితే.. ప్రశ్నకు ప్రశ్న ఎప్పటికీ సమాధానం కాదన్నది వాస్తవం. కాంగ్రెస్ వ్యవహరించిన.. రాజకీయాలే ఆ పార్టీని పుట్టిముంచాయి.
ఈ క్రమంలోనే ప్రజలు మోడీని వరుస విజయాలతో ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టారు. సో.. ఆయన ఇలా బుల్డోజ్ చేసుకుంటూ.. ప్రశ్నకు ప్రశ్న సమాధానమన్న విధంగా వ్యవహరించడం సరికాదన్నది జాతీయ మీడియాలో వెల్లువెత్తిన వ్యాసాలు చెబుతున్నాయి.
ప్రధాని సమాధానం చెప్పని కీలక ప్రశ్నలు ఇవీ..
+ పహల్గా ఉగ్రవాద దాడిపై ఇంటెలిజెన్స్ ఎందుకు ముందుగానే పసిగట్టలేక పోయింది?
+ ఆపరేషన్ సిందూర్.. అర్ధంతరంగా ఆపేయడానికి రీజనేంటి?
+ ట్రంప్ చెప్పాడని ఆపేస్తే.. అసలు మన దేశ భద్రత ను పొరుగు దేశాలు శాసించడమేనా?
+ పహల్గాంలో పర్యాటకులకు భద్రత ఎందుకు కల్పించలేదు?
+ సింధు ఒప్పందం తప్పని అంటున్న మోడీ... 2014-24 వరకు పదేళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నారు?
+ పాకిస్థాన్.. తాము దారుణంగా దెబ్బతిన్నామని ఇక, చాలు ఆపేయమని అంటే.. పోరాటం ఆపేస్తారా?
+ సైనిక బలగాలకు ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదు? ఏం జరిగింది?
+ మోడీ చెబుతున్నట్టుగా.. స్వదేశీ ఆయుధాలు అంత బలమైనవే అయితే.. సీడీఎస్..అనిల్ చౌహాన్.. ఇటీవల.. చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి?( నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం చేయలేమని ఆయన తీవ్ర వ్యాఖ్యలుచేశారు). ఇలా.. అనేక ప్రశ్నలు పార్లమెంటులో లేవనెత్తినా. ఒక్కదానికీ నేరుగా మోడీ సమాధానం చెప్పలేక పోయారు.