బీజేపీ తరువాత పవనే !
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు అందరికీ తెలుసు. హిందూత్వ విధానాలతో ఆ పార్టీ జనసంఘ్ రూపంలో పుట్టింది.
By: Tupaki Desk | 29 April 2025 10:00 PM ISTభారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు అందరికీ తెలుసు. హిందూత్వ విధానాలతో ఆ పార్టీ జనసంఘ్ రూపంలో పుట్టింది. ఆ తరువాత బీజేపీగా ఎదిగింది. ఇక బీజేపీ హార్డ్ కోర్ హిందూత్వ పార్టీ అని చెప్పాల్సి ఉంది. అయితే బీజేపీ స్థాయిలో హిందూత్వ భావజాలాన్ని గట్టిగా వినిపించే పార్టీ మరొకటి దేశంలో లేదు. మహరాష్ట్రలో శివసేన ఉన్నా ఇపుడు ఇండియా కూటమిలో ఉంటూ తన సౌండ్ తగ్గించుకుంది.
ఇదిలా ఉంటే దక్షిణాదిన అయితే బీజేపీ హిందూత్వ రాగమే సన్నసన్నగా ఉంటుంది అలాంటి చోట పవన్ కళ్యాణ్ అనే నాయకుడు బీజేపీకి ఆ లోటు తీర్చడమే కాదు, తాను కూడా బిగ్గరగా హిందూత్వ రాగాన్ని అందుకోగలను అని చాటి చెబుతున్నారు.
ఆయన తాజాగా కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడి మీద తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్టు అయిన తీరు చూస్తే బీజేపీలో ఫైర్ బ్రాండ్స్ తరువాత వరసలో ఆయనే ఉన్నారని అనిపిస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే చాలా మంది బీజేపీ నాయకులు కూడా అంత గట్టిగా మాట్లాడలేరు అనే స్థాయిలో పవన్ స్పందన ఉంది.
ఇక బీజేపీ మిత్రపక్షాలలో అయితే ఎవరూ కూడా ఈ ఉగ్ర దాడి విషయంలో ఖండించి ఊరుకున్నారు తప్పించి భారీ ఎత్తున విమర్శలు చేయలేదు. హిందూత్వను హైలెట్ చేస్తూ మాట్లాడింది కూడా లేదు. ఇంతకీ పవన్ ఏమన్నారు అంటే ఈ ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఒకే ఒక దేశం భారత్ అని అక్కడే చంపేస్తే ఇక ఎక్కడికి పోతారు అని సరైన ప్రశ్ననే వేశారు.
హిందువులు బతకవద్దా అని మరో ప్రశ్నను కూడా ఆయన రైజ్ చేశారు. పాకిస్థాన్ ని ప్రేమించే వారు ఆ దేశం వెళ్ళిపోవచ్చు అని బుజ్జగింపు రాజకీయాలను చేసే వారిని ఏకి పారేశారు. ఇలా పవన్ చాలా విపులంగానే మాట్లాడారు.
ఆయన మాటలు వింటూంటే హార్డ్ కోర్ హిందూత్వ అందులో కనిపిస్తుంది. ఈ దేశంలో బీజేపీ హిందూత్వ తరువాత సెక్యులర్ అంటూ కొన్ని పార్టీలు ఉన్నాయి. న్యూట్రల్ గా ఉండే పార్టీలు ఉన్నాయి. అయితే బీజేపీకి సరితూగే పార్టీగా జనసేన ఇపుడు ముందు వరసలోకి వచ్చింది.
ఆ పార్టీ సైతం హిందువుల కోసమే అంటోంది. ఇక పవన్ చాలా స్పష్టంగా హిందువులకు మద్దతు పలికిన తీరుని చూసిన తరువాత ఆయన లేవనెత్తిన అనేక ప్రశ్నలు చూసిన తరువాత బీజేపీలో కూడ ఇంత ఫైర్ ఉందా అన్న డౌట్లూ సైతం వ్యక్తం అవుతున్నాయి. అంతలా పవన్ భారత్ మీద జరిగిన ఉగ్ర దాడి విషయంలో తన భావాన్ని వ్యక్తం చేశారు.
అంతే కాదు ఆయన మరో మాట అన్నారు. రాష్ట్రపతి పాలన ఉన్నపుడే కాశ్మీర్ బాగా ఉందని, ప్రశాంతంగా ఉందని. ఈ పాయింట్ కూడా ఎవరూ అనలేదు, ఎవరూ ఈ కోణంలో కనీసం ఆలోచించలేదు. బీజేపీ కూడా ఈ విషయాన్ని క్లెయిం చేస్తూ కాశ్మీర్ లో ఏమి జరిగిందో తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేకపోయిందా అన్న చర్చ వస్తోంది.
ఏది ఏమైనా కూడా పవన్ బీజేపీ తరువాత దేశంలో బలమైన హిందూత్వ వాదాన్ని వినిపిస్తున్నారు. ఆ విషయంలో ఆయన నాలుగాకులు ఎక్కువే చదివారు అనిపిస్తోంది. పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ అందునా సినీ గ్లామర్ ఉన్న వారు ఇంతలా పదునైన విమర్శలతో ఉగ్రవాదాన్ని ఎండగడుతూ హిందువుల మీద జరిగిన దాడికి సానుభూతి తెలుపుతూంటే అది కచ్చితంగా జనంలోకి వెళ్తుంది అన్నది నిజం.
మరో వైపు చూస్తే బీజేపీ వంటి జాతీయ పార్టీ కొన్ని విషయాలు మాట్లాడడానికి వెనకా ముందు ఆడుతోందేమో కానీ పవన్ మాత్రం ఎలాంటి శషబిషలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొడుతున్నారు. ఇది ఆయన రాజకీయ గమనంలో ఏ మలుపుకి తీసుకుని వెళ్తుందో చెప్పడం ఇపుడు కష్టమే కావచ్చు కానీ పవన్ స్పందించిన తీరుకు సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
దేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా ఖండించలేదని అంతా అంటున్నారు. పవన్ ని వారంతా మెచ్చుకుంటున్నారు. పవన్ మాదిరిగా మిగిలిన వారు కూడా లెక్కలూ సమీకరణలూ చూసుకోకుండా తీవ్రంగా ఖండించాల్సిన సందర్భం ఇదని అంటున్నారు.