Begin typing your search above and press return to search.

పవన్ ఆరాటమే కానీ !

మాట్లాడితే చాలు ఏపీలో కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటుందని జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 1:05 PM IST
పవన్ ఆరాటమే కానీ !
X

మాట్లాడితే చాలు ఏపీలో కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటుందని జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మరోసారి ఆ మాటే వల్లించారు. అయితే ఈసారి పదిహేనుని కాస్తా ఇరవై ఏళ్లకు పెంచేశారు. అంటే 2045 వరకూ అన్న మాట.

ఇది ఫక్తు రాజకీయం. ఇక్కడ రాజు ఎవరో మంత్రి ఎవరో క్షణ క్షణం మారుతూ ఉంటుంది. రాజకీయాల్లో ఎపుడూ అడ్వాంటేజెస్ అవకాశాలు ఇవే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చాన్స్ తీసుకోవాలని పై చేయి సాధించాలని ప్రతీ ఒక్కరూ ఎత్తులకు పై ఎత్తు వేస్తూంటారు.

అటువంటి రాజకీయాల్లో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక విడిపోయిన పార్టీలు ఎన్నో కనిపిస్తాయి. అంతదాకా ఎందుకు బీహార్ లో నితీష్ కుమార్ 2020 నుంచి ఈ రోజుదాకా ఎన్డీయే నుంచి ఇండియా కూటమికి అలాగే ఇండియా కూటమి నుంచి ఎన్డీయేకు ఇలా ఎన్నిసార్లు పిల్లి మొగ్గలు వేశారో అంతా చూశారు.

దేశ రాజకీయాల్లో ఇలాంటివి మామూలుగానే జరుగుతుంటాయి. అంతిమ లక్ష్యం అధికారం అయినపుడు రాజకీయం అనే తులాభారంలో త్రాస్ కూడా అటే మొగ్గుతుంది. అందువల్ల ఈ రోజు ఎలా గడచింది అన్నదే అంతా చూసుకుంటారు. ఇక ఏపీలో మూడు పార్టీల కూటమి పాలనకు ఏడాది కాలం గడచింది. వివాదాలకు చోటు లేకుండా ఈ ఏడాది గడిపినందుకు కూటమి పార్టీలను అభినందించాలి.

అయితే అది పై స్థాయిలోనే సుమా అన్న మాట కూడా ఉంది. కాస్తా దిగువకు వస్తే గ్రౌండ్ లెవెల్ లో కూటమి పార్టీల మధ్య సిగపట్లు కొనసాగుతూనే ఉన్నాయి అని ప్రచారంలో ఉంది. ఇక పెద్దన్నగా టీడీపీ ఉన్నా అన్ని పదవులూ తమకే దక్కలేదన్న అసంతృప్తి కూడా పసుపు పార్టీలో ఉంది. జనసేన కోటాలో ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తి పరుస్తూ టీడీపీలో ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న ఆవేదన తమ్ముళ్ళల్లో ఉంది.

బీజేపీలో అయితే తమకు నామినేటెడ్ పదవులు పెద్దగా దక్కడం లేదు అన్న నిరాశ ఉంది. జనసేన విషయమే తీసుకుంటే వారికి పవన్ చెప్పిందే వేదం అని ఎంత అనుకున్నా తన నాయకుడు ఎప్పటికీ ఉప దళపతిగానే ఉండిపోతారు అంటే మాత్రం వారు మాత్రం ఎంతకాలం అలా కూటమిని మోస్తారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది.

ఇంకో వైపు చూస్తే బీజేపీ ఏపీలో విస్తరించాలనుకుంటోందని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు జమానా నడించేంతవరకూ ఆగి ఆ తరువాత తన వ్యూహాలను అమలు చేస్తుందని కూడా ప్రచారంలో ఉన్న విషయం. ఇక ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం పవన్ ని సీఎం గా చూడాలని అనుకుంటోంది. అలాగే అభిమానులు కూడా వచ్చే ఎన్నికల దాకానే కూటమిలో ఉప పాత్రకు జనసేనను అంగీకరిస్తారు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే రెండు దశాబ్దాల పాటు కూటమి పార్టీల బంధం కొనసాగాలని ఒక్క జనసేన తప్ప టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఈ తరహా ప్రకటనలు అయితే రావడం లేదు. మరి పవన్ ఆరాటమే కానీ వాస్తవాలు వేరేగా ఉంటాయన్నది కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒకే పార్టీని కానీ కూటమిని కానీ ఇన్ని దశాబ్దాలు అధికారంలో ఉంచిన చరిత్ర గత నలభై ఏళ్ళలో ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు.

ఇక అభివృద్ధి కోసం ఒకే పార్టీ ఉండాలని అందరూ అంటారు. కానీ అభివృద్ధి నిరంతర ప్రవాహం లాంటిది. అందువల్ల రాజకీయాల్లో అంతిమ నిర్ణేతలు అసలు తీర్పరులు ప్రజలే. మొత్తానికి కూటమికి కట్టుబడిపోతాను అన్న పవన్ నిబద్ధతను నిజాయతీని ఎవరూ ప్రశ్నించలేరు కానీ రాజకీయంగా చూస్తే సాధ్యాసాధ్యాల మీదనే అంతా ఆలోచిస్తున్నారు.