పార్లమెంట్ సెషన్ : వాయిదాలు తప్ప చర్చలేవీ ?
దేశంలో అత్యున్నత చట్ట సభలుగా లోక్ సభ రాజ్యసభ ఉన్నాయి. ఇక వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ప్రారంభం అయ్యాయి.
By: Satya P | 13 Aug 2025 6:00 PM ISTదేశంలో అత్యున్నత చట్ట సభలుగా లోక్ సభ రాజ్యసభ ఉన్నాయి. ఇక వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 21 వరకూ ఈ సమావేశాలు జరుగుతాయని షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ఈసారి చూస్తే కనుక అత్యధిక పని దినాలలో వాయిదాల పర్వమే సాగుతూ వస్తోంది. ఆపరేషన్ సింధూర్ మీద మాత్రమే చర్చ వాడిగా వేడిగా సాగింది.
ప్రతీ రోజూ అంతేనా :
ఇక దాదాపుగా చూస్తే ప్రతీ రోజూ పార్లమెంట్ సమావేశం అవుతూనే విపక్షాలు నిరసనల మధ్య ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రతిపాదించడం ఆ తరువాత సభ వాయిదా పడుతున్న దశలో పెద్దగా చర్చ లేకుండా వాటిని ఆమోదించడం జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ఈ విధంగా వర్షార్పణం అయ్యాయని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కానీ విపక్ష నేత రాహుల్ గాంధీ కానీ సభలో ఎక్కువగా కనిపించడం లేదు. అలాగే ఇతర సభ్యులకు కూడా ఆసక్తి తగ్గిపోతోంది అని అంటున్నారు.
ఒకే ఒక ఇష్యూతో :
విపక్షాలు అన్నీ ఒకే ఒక అంశం మీదనే ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో పట్టుబడుతున్నాయి. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అంశంపైనే లోక్‌సభ రాజ్యసభ చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే దానికి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ప్రతీ రోజూ దాదాపుగా సభ అనేకసార్లు వాయిదా పడుతూ చివరికి మరుసటి రోజుకు వాయిదాగా సాగుతోంది. ఇక మంగళవారం లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడగా, రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది, చివరికి ఈ నెల 18వ తేదీకి ఉభయ సభలు వాయిదా పడడం విశేషం.
చర్చలో పాల్గొనాలంటూ :
ఇదిలా ఉంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్ కుర్చీ వైపు కాగితం విసిరినందుకు వారి ప్రవర్తనను ఖండించారు. ఇది సభా మర్యాదకు విరుద్ధమని ఆయన అన్నారు. దేశ ప్రజలు చర్చలో పాల్గొనడానికి ప్రతిపక్ష ఎంపీలను పంపినందున వారు చర్చలో పాల్గొనాలని ఆయన అన్నారు. నిరసన తెలుపుతున్న ఎంపీల ప్రవర్తనపై స్పీకర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు, వారు సభా మర్యాదను దెబ్బతీస్తున్నారని అన్నారు.
కీలక బిల్లులు ఆమోదం :
ప్రభుత్వం పార్లమెంట్ ని సమావేశపరచేది బిల్లులను ఆమోదించుకోవడానికి. అయితే విపక్షం ఆ బిల్లులల్లో లోటు పాట్లను చర్చించి సరైన సూచనలు చేసి బిల్లులు జనాలకు పూర్తిగా ఉపయోగపడేలా చూడాల్సి ఉంది. కానీ విపక్ష సభ్యులు వాకౌట్ చేస్తున్నారు. దాంతో ఏ చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. అలా మంగళవారం లోక్‌సభ జాతీయ క్రీడా పాలన బిల్లు, 2025, జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు, 2025లను ఆమోదించింది. ఆదాయపు పన్ను బిల్లు, 2025 పన్ను చట్టాలు సవరణ బిల్లు, 2025లను కూడా సభ ఆమోదించింది.
గతంలో సాగు చట్టాలతో :
ఇక వెనక్కి వెళ్తే సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. వరసగా మూడు సెషన్ల సభా కాలాన్ని చర్చలు లేకుండానే ముగించేశారు. ఇలా పార్లమెంట్ సెషన్ కి ముందు జాతీయ అంశాలు అనేకం ఉన్నా కొన్ని మాత్రమే విపక్షాలు తీసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దాంతో మిగిలినవి మరుగున పడిపోతున్నాయి అంటున్నారు.
సజావుగా జరుగుతున్నాయా :
మోడీ ప్రధాని అయ్యాక 2014 నుంచి 2019 మధ్యలో కొంత సజావుగా పార్లమెంట్ సమావేశాలు జరిగాయని అంటున్నారు. ఆ తరువాత రెండోసారి మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి పార్లమెంట్ సెషన్లలో అధికార పక్షం వర్సెస్ విపక్షంగా మారిపోతూ సభా కాలాన్ని హరించేస్తున్నాయని అంటున్నారు. ఇక్కడ విపక్షం లేవనెత్తే అంశాలలో సహేతుకత ఉంటే వాటిని అధికార పక్షం స్వీకరించి చర్చకు రావాలి. అలాగే విపక్షం సైతం ఒకే ఇష్యూకే కట్టుబడిపోకుండా విశాలమైన దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కీలక బిల్లుల మీద చర్చ జరపాలని ప్రజాస్వామ్య ప్రియులు కోరుతున్నారు. శీతాకాల సమావేశాలలో అయినా ఆ వైఖరి కనబడాలని అంతా ఆశిస్తున్నారు.