విశాఖలో ఓ కుటుంబం.. ఇద్దరు ఇండియన్స్, ఇద్దరు పాకిస్థానీస్
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో నివసిస్తున్న పాకిస్థానీయులు లెక్కలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 5:00 AM ISTపహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో నివసిస్తున్న పాకిస్థానీయులు లెక్కలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలా.. ఒకే కుటుంబంలో కొందరు మన దేశ పౌరులు ఉండగా, మరికొందరు పాకిస్థాన్ పౌరసత్వంతో ఉంటున్నారు. ఇలా ధర్మవరంలో ఓ కుటుంబం గుర్తించగా, తాజాగా విశాఖలోనూ మరో కుటుంబం బయటపడింది. దశాబ్దాలుగా పాకిస్థాన్ పౌరులతో బంధుత్వం ఉండటమే కాకుండా, అక్కడ జన్మించి మనదేశంలో నివసిస్తున్న వారు లాంగ్ వీసాలతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. అయితే ఇప్పుడు పాక్ పౌరులు అంతా దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాక్ పౌరసత్వం ఉన్నవారు భయంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
విశాఖలో ఓ కుటుంబంలో తండ్రి, పెద్ద కుమారుడు పాకిస్థాన్ పౌరసత్వం కలిగి ఉండగా, తల్లి, చిన్నకుమారుడు మన దేశం పౌరులుగా గుర్తించారు. తండ్రి, పెద్ద కుమారుడు చాలా కాలంగా విశాఖలోనే ఉంటున్నారు. ఇప్పుడు దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి రావడంతో తమ అనారోగ్యం దృష్టిలో పెట్టుకుని విశాఖలోనే ఉండేలా అనుమతిలివ్వాలని పోలీసులను అభ్యర్థిస్తున్నారు. దీంతో వారి విషయాన్ని పోలీసులు ప్రభుత్వానికి నివేదించారు.
విశాఖ కమిషనర్ శంఖబ్రత బాగ్చీని సోమవారం ఓ కుటుంబం కలిసి తమ పరిస్థితిని తెలియజేసింది. ఈ కుటుంబంలో భర్త, పెద్ద కుమారుడు పాకిస్థాన్ పౌరసత్వం కలిగి ఉన్నారు. భార్య, చిన్నకుమారుడు భారత పౌరులు. పహల్గామ్ దాడి నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో సదరు కుటుంబం కమిషనర్ ను కలిసి తమ గోడ వెళ్లబోసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ పెద్దకుమారుడికి విశాఖలో చికిత్స చేయిస్తున్నామని, దీర్ఘకాల వీసా కోసం దరఖాస్తు చేసుకోగా, అది పెండింగులో ఉందని వివరించారు. దీనిపై సీపీ మాట్లాడుతూ, వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, అక్కడి నుంచి సమాచారం వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.