బుద్ధిమారని పాక్.. పీఓకేలో మరో దుశ్చర్య
పాకిస్తాన్ తన దుర్బుద్ధిని వీడడం లేదు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్ స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన పాత పంథాలోనే ముందుకు సాగుతోంది.
By: A.N.Kumar | 5 Aug 2025 3:59 PM ISTపాకిస్తాన్ తన దుర్బుద్ధిని వీడడం లేదు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్ స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన పాత పంథాలోనే ముందుకు సాగుతోంది. భారత భద్రతా బలగాలు గతంలో చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను, లాంచ్ ప్యాడ్‌లను పీఓకేలో మళ్లీ పునరుద్ధరిస్తోంది. ఈ చర్యల వెనుక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాద శిబిరాల పునర్నిర్మాణం
గత మూడు నెలల కాలంలో పీఓకేలో దాదాపు 15కు పైగా ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్‌లను తిరిగి స్థాపించారు. ఈ శిబిరాల ఏర్పాటుకు ఐఎస్‌ఐతో పాటు ఇతర పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు కూడా సహకరిస్తున్నాయి. దీనికి ఉగ్రవాద సంస్థల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా కెల్, షార్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా వ్యాలీ, తండపాణి, నయ్యాలి, జాంకోట్, చకోఠి వంటి సున్నిత ప్రాంతాల్లో ఈ పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అంతేకాక, జమ్మూ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మస్రూర్, చాప్రార్, షకర్‌గఢ్ వంటి ప్రాంతాల్లోనూ లాంచ్ ప్యాడ్‌లు, డ్రోన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
వ్యూహాలు మారుస్తున్న ఉగ్రవాదులు
భారత సైనిక దళాల దాడుల వల్ల ఉగ్రవాదులు తమ పాత పద్ధతులను మార్చుకున్నారు. గతంలో 100 మందికి పైగా ఉగ్రవాదులు ఉండే పెద్ద శిబిరాలకు బదులుగా, ఇప్పుడు చిన్న చిన్న శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక శిబిరంలో 20-25 మంది మాత్రమే ఉండేలా చూస్తున్నారు. దీనివల్ల భారత బలగాలు సులభంగా గుర్తించకుండా ఉంటారని వారి ఉద్దేశం.
అధునాతన సాంకేతికతతో శిక్షణ
ఉగ్రవాదులకు ఇచ్చే శిక్షణలో కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, ఉపగ్రహ మాస్కింగ్ టెక్నాలజీ వంటి ఆధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాల్లో మహిళలు, పిల్లలను మానవ కవచాలుగా ఉపయోగించడం వంటి దారుణ పద్ధతులు అవలంబిస్తున్నారు.
భారీ నిధుల వెల్లువ
ఐఎస్‌ఐ ఈ పునర్నిర్మాణ పనుల కోసం రూ. 100 కోట్ల పాకిస్తానీ రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు అంచనా. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునివ్వడం ఆపలేదు. పీఓకేలో శిబిరాల పునరుద్ధరణ అనేది భారత భద్రతా వ్యవస్థకు ఒక సవాలుగా పరిణమించింది. అయితే, ఇటువంటి కుట్రలను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని, తగిన విధంగా బుద్ధి చెబుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.