Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ కు ‘బ్రహ్మోస్’ భయం... బయటపడే మార్గాలకు ఇదిగో ‘నో ఛాన్స్’!

పాక్ డ్రోన్లు భారత్ ను తాకకుండా అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు ఒకపక్క.. పాక్ లో ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని అదరగొట్టిన బ్రహ్మోస్ క్షిపణుల పెర్ఫార్మెన్స్ మరో లెక్క.

By:  Tupaki Desk   |   12 Jun 2025 10:00 PM IST
పాకిస్థాన్  కు ‘బ్రహ్మోస్’ భయం... బయటపడే మార్గాలకు ఇదిగో  ‘నో ఛాన్స్’!
X

పాకిస్థాన్ ఆలోచనా విధానం, పాకిస్థాన్ ఫ్యూచర్.. పహల్గాం ఉగ్రదాడికి ముందు, తర్వాత అన్నట్లుగా మారిపోయిందన్నా అతిశయోక్తి కాదేమో! పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలు, ఆపరేషన్ సిందూర్ తో ఇచ్చిన సైనికపరమైన చర్యల ఫలితాలు పాక్ ను వణికించేసిన పరిస్థితి. భారత క్షిపణుల దాటికి పాక్ బెంబేలెత్తిపోయింది.

పాక్ డ్రోన్లు భారత్ ను తాకకుండా అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు ఒకపక్క.. పాక్ లో ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని అదరగొట్టిన బ్రహ్మోస్ క్షిపణుల పెర్ఫార్మెన్స్ మరో లెక్క. ఈ సమయంలో భారత్ సత్తాతో పాటు పాకిస్థాన్ నమ్ముకున్న ఆయుధాలపైనా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో.. ఆయుధాల విషయంలో పాక్ ఆలోచన మార్చుకుందని తెలుస్తోంది.

అవును... భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో చైనా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థలు భారత్ అస్త్రాలను నిలువరించలేకపోయాయి! దీంతో.. ఆ వ్యవస్థకు స్వస్థి పలకాలని పాకిస్థాన్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ సమయంలో.. జర్మనీ నుంచి అధునాతన రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసి, 'బ్రహ్మోస్' భయం నుంచి బయటపడాలని భావిస్తోంది!

వాస్తవానికి ఆపరేషన్‌ సిందూర్‌ లో భారత్ 'బ్రహ్మోస్‌' క్షిపణులను ప్రయోగించినట్లు ఆర్మీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. పొలిటికల్ వేదికలపై మాత్రం ఈ మేరకు కామెంట్లు వినిపించాయి. కానీ, తమ ఎయిర్ బేస్ లపై భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణులను ప్రయోగించిందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ బహిరంగంగా వ్యాఖ్యానించారు.

దీంతో.. చైనా నుంచి కొనుగోలు చేసిన హెచ్.క్యూ-9, హెచ్.క్యూ-16 గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగిస్తే... భారత్ ప్రయోగించే డ్రోన్లు, క్షిపణి దాడులను అడ్డుకోలేమని పాక్ పక్కాగా ఒక క్లారిటీకి వచ్చిందని అంటున్నారు. బ్రహ్మోస్ పూర్తి స్థాయిలో ప్రయోగిస్తే తమ పని ఇబ్బందే అని భావించిన నేపథ్యంలో.. కచ్చితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా రష్యా అవిరామంగా దాడులు చేస్తున్నా.. .సమర్థవంతంగా తిప్పుకొడుతున్న ఉక్రెయిన్ వినియోగిస్తున్న గగనతల రక్షణ వ్యవస్థను సొంతం చేసుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీని జర్మనీ నుంచి కొనుగోలు చేసింది ఉక్రెయిన్. ఇప్పుడు అదే టెక్నాలజీని తాము నమ్ముకోవాలని పాక్ భావిస్తోందని అంటున్నారు.

అయితే.. జర్మనీకి చెందిన డీల్ డిఫెన్స్ సంస్థతో పాకిస్థాన్ ఒప్పందం చేసుకోవడం అంత సులువేం కాదని అంటున్నారు. ఎందుకంటే.. ఆ సంస్థలో భాగస్వామ్యం ఉన్న థైసెన్ క్రప్ మెరైన్ సిస్టమ్స్ అనే సంస్థ భారత్ లోని వివిధ రక్షణ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సుమారు రూ.70 వేల కోట్లతో భారత్ 6 జలాంతర్గాములను అభివృద్ధి చేస్తోంది.

ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్న భారత్ ను కాదని.. పాకిస్థాన్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు డీల్ డిఫెన్స్, థైసెన్ క్రప్ మెరైన్ సిస్టమ్స్ సంస్థలు పాక్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకువచ్చే అవకాశాలు చాలావరకూ తక్కువని అంటున్నారు.