దాడికి ముందు రెక్కీ... ఎన్ఐఏ కి షాకింగ్ వీడియో ఇచ్చిన టూరిస్ట్!
పహల్గాంలో బైసరన్ లోయలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 April 2025 4:15 PM ISTపహల్గాంలో బైసరన్ లోయలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై భారత సంస్థల దర్యాప్తు చేస్తున్నాయి. ఈ సమయంలో దర్యాప్తు సంస్థలకు పలువురు ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇస్తున్నారు. ఈ సమయంలో పూణెకు సంబంధించిన ఓ పర్యాటకుడు ఉగ్రవాదుల రెక్కీకి సంబంధించిన వీడియో విడుదల చేశారు.
అవును... పహల్గాంలోని లోయల్లో ఉగ్రదాడికి కొన్నాళ్ల ముందు నుంచి ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారనే సందేహాలు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో.. ఆ సందేహాలు బలపడుతున్నాయి. ఈ సమయంలో తాజాగా పూణేలో స్థిరపడిన మలయాళ పర్యాటకులు తమ కుమార్తె కోసం చిత్రీకరించిన వీడియోలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు దృశ్యాలు బయటకు వచ్చాయి.
వివరాళ్లోకి వెళ్తే... శ్రేజిత్ రమేశన్ ఈ నెల కుటుంబతో కలిసి జమ్మూకశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏప్రిల్ 18న తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బేతాబ్ వ్యాలీకి వెళ్లారు. ఇది పహల్గాంకు సుమారు 7.5 కిలోమీటర్ల దూరంలోనూ, బైసరన్ వ్యాలీకి 10 కి.మీ. దూరంలోనూ ఉంది!
ఈ సమయంలో తన కుమార్తె కోసం వీడియో చిత్రీకరించారు. ఆ సమయంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు ఆ వీడియోలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే... ఏప్రిల్ 22న బైసరన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో.. రమేశన్ బంధువులు, మిత్రులకు ఆయన ఫోన్ చేసి క్షేమసమాచారం కనుక్కొన్నారు.
అదే సమయంలో నిందితుల ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేయడం, అనంతరం ఫోటోలు తెరపైకి రావడంతో.. రమేశన్ కు సందేహం వచ్చి బేతాబ్ వ్యాలీలో తాను తీసిన వీడియోలను పరిశీలించారు. ఈ సమయంలో ఆ వీడియోలోని ఇద్దరు వ్యక్తులు.. ఊహాచిత్రాల్లోని ఉగ్రవాదులతో పోలి ఉన్నట్లు గుర్తించారు.
దీంతో.. రమేశన్ వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ)ను సంప్రదించారు. అనంతరం ఆ వీడియో క్లిప్ ను వారికి అందజేశారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోలోని దృశ్యాలపై అధికారులు ఫోరెన్సిక్ దర్యాప్తు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలోని దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.