"మా బాధతో ఆటలాడవద్దు".. కన్నీటితో వేడుకున్న పహల్గాం అమర జవాన్ భార్య!
ఉగ్రవాదులకు కులం, మతం ఉండవని వాదెట్టివార్ అనడం, పర్యాటకులను కాల్చే ముందు వారి మతం గురించి అడిగారనే వాదనపై అనుమానం వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపింది.
By: Tupaki Desk | 29 April 2025 7:55 PM ISTపహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో భర్తను కోల్పోయిన ఒక అమర జవాన్ భార్య రాజకీయ నాయకుల నిర్లక్ష్యపు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దుఃఖాన్ని రాజకీయం చేయవద్దని ఆమె చేసిన హృదయ విదారక అభ్యర్థన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఆ దుర్ఘటన గురించి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన సంతోష్ జగ్‌దలే భార్య ప్రగతి జగ్‌దలే రాజకీయ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని రాజకీయ కోణంలో చూడవద్దని, తమ బాధను మరింత పెంచేలా మాట్లాడవద్దని ఆమె కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాదెట్టివార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.
ఉగ్రవాదులకు కులం, మతం ఉండవని వాదెట్టివార్ అనడం, పర్యాటకులను కాల్చే ముందు వారి మతం గురించి అడిగారనే వాదనపై అనుమానం వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ప్రగతి పుణెలో మీడియాతో మాట్లాడుతూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. "ఆ భయంకరమైన ఉగ్రదాడి తాలూకు గాయాలు ఇంకా మానలేదు. కళ్లు మూసుకుంటే చాలు. రైఫిల్‌తో నిలబడ్డ ఉగ్రవాది కనిపిస్తున్నాడు. ఉగ్రవాదం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాం. విద్వేషపూరిత మాటలు విన్నాం. సరిగా నిద్రపోయి ఎన్ని రోజులైందో కూడా గుర్తులేదు. దయచేసి ఈ దుర్ఘటనను రాజకీయం చేయకండి. మా బాధతో ఆటలాడవద్దని రాజకీయ నాయకులందరినీ వేడుకుంటున్నాను" అని ఆమె కన్నీటితో అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ దుర్ఘటనలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వారిలో మహారాష్ట్రకు చెందిన సంతోష్ జగ్‌దలే ఒకరు.
మరోవైపు, ఈ దుర్ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని క్యాబినెట్ సమావేశం తర్వాత తెలిపారు.