Begin typing your search above and press return to search.

మోడీ.. ట్రంప్ కు కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదు..?

అవును... భారత పార్లమెంటులో 'ఆపరేషన్‌ సిందూర్‌'పై చర్చ రసవత్తరంగా జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Raja Ch   |   30 July 2025 9:11 AM IST
మోడీ.. ట్రంప్ కు కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదు..?
X

ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో వాడీవేడి చర్చ జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం తరుపున సుదీర్ఘ వివరణలు వచ్చాయి.. విపక్షల నుంచి ఊహించని స్థాయిలో అన్నట్లుగా ఎదురుదాడీ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక విషయంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ, విపక్షాలకు దొరికిపోయారనే కామెంట్లు వినిపించాయి. అందుకు కారణం.. ట్రంప్ విషయంలో ఆయన సూటిగా, స్పష్టంగా మాట్లాడకపోవడమే అని అంటున్నారు.

అవును... భారత పార్లమెంటులో 'ఆపరేషన్‌ సిందూర్‌'పై చర్చ రసవత్తరంగా జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తానే గనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే.. భారత్‌ - పాకిస్థాన్‌ లు ఈపాటికి యుద్ధంలో ఉండేవని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్‌ తో కలిసి స్కాట్లాండ్‌ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రధనంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బలంగా నొక్కి చెప్పి, నిలదీశారు. ఈ క్రమంలో ప్రియాంక నుంచి మోడీపై తీవ్ర విమర్శలు రాగా.. రాహుల్ నుంచి మోడీకి ఛాలెంజ్ కూడా వచ్చింది. అయినప్పటికీ... ఈ విషయంలో మోడీ సూటిగా, స్పష్టంగా ఆ విషయంపై స్పందించలేదనే కామెంట్లు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ అంశం పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిందని అంటున్నారు!

శత్రువులు ఎక్కడికీ వెళ్లలేని సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారో సమాధానం చెప్పలేదని.. నాయకత్వం అంటే క్రెడిట్‌ తీసుకోవడమే కాదు బాధ్యత కూడా తీసుకోవాలని.. ఇలా ఆకస్మికంగా యుద్ధాన్ని ఆపడం దేశ చరిత్రలోనే మొదటిసారని.. పైగా, ఆ ప్రకటన అమెరికా అధ్యక్షుడు చేశారని.. ఇది మన ప్రధాని బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తోందని.. మన దౌత్యం విఫలమైందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

మరోవైపు... సీజ్ ఫైర్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను బహిరంగంగా తిరస్కరించాలని, ఆయనను అబద్ధాలకోరు అని పిలవాలని ప్రధానీ మోడీకి రాహుల్ గాంధీ సవాలు విసిరారు. ఈ సమయంలో... ‘ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? ట్రంప్ అబద్ధం చెబుతుంటే, చెప్పండి.. పార్లమెంటులోనే లేచి చెప్పండి.. ట్రంప్ అబద్ధాల కోరు అని ధైర్యం ఉంటే చెప్పండి’ అని అడిగారు.

ఈ సందర్భంగా... డోనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపానని 29 సార్లు చెప్పారు.. ఇందిరా గాంధీ ధైర్యంలో 50 శాతం ప్రధానికి ఉంటే, మోడీ పార్లమెంటులో లేచి నిలబడి "డోనాల్డ్ ట్రంప్ అబద్ధం చెబుతున్నాడు, ఆయన ఎప్పుడూ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించలేదు" అని చెప్పాలని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో... మోడీ ఇరుకున పడ్డారనే కామెంట్లు వినిపించగా.. లేదు, ఈసారి ఆయన నుంచి సూటిగా సమాధానం వస్తాదని మరికొందరు స్పందించారు.

అయితే... ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని, ఆపరేషన్‌ సిందూర్‌ ను ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని మాత్రమే మోడీ చెప్పారు! కాకపోతే... మే 9న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఫోన్ చేశారని.. పాక్‌ పెద్ద దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారని.. పాక్‌ గానీ భారత్‌ పై దాడికి దిగితే మా దాడి ఇంకా భారీగా ఉంటుందని చెప్పానని మోడీ చెప్పుకొచ్చారు!

ఈ నేపథ్యంలోనే.. ప్రియాంక విమర్శించారనో.. రాహుల్ గాంధీ నిలదీసి, సవాల్ విసిరారనో కాదు కానీ... ఈ విషయంలో దేశ ప్రజలకు మోడీ మరింత క్లారిటీ ఇచ్చి ఉండాల్సిందనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే ఎన్నో సార్లు, పలు ప్రపంచ వేదికలపై ఈ విషయాన్ని చెప్పినప్పుడు.. పార్లమెంటులో మోడీ దీనిపై సూటిగా స్పష్టత ఇచ్చి ఉండాల్సిందని.. ట్రంప్ మరోసారి ఈ విషయంపై ఎక్కడా మాట్లాడకుండా కౌంటర్ ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు.

అలాకాకుండా.. ఆపరేషన్‌ సిందూర్‌ ను ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని.. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని మాత్రమే చెప్పడం వల్ల.. ప్రజలకు ఈ విషయంలో సందేహాలు సజీవంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.