ఆపరేషన్ సిందూర్... ప్రియాంక నోట ట్రంప్.. మోడీ నోట వాన్స్!
భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ పై వాడీవేడి చర్చ జరుగుతుంది.
By: Raja Ch | 30 July 2025 8:15 AM ISTభారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ పై వాడీవేడి చర్చ జరుగుతుంది. ఈ సమయంలో బీజేపీ – కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. ఇదే సమయంలో భారత పార్లమెంట్ లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భుజాలపై తుపాకులు పెట్టి అటు మోడీ, ఇటూ ప్రియాంక నిప్పులు చెరిగారనే చర్చ ఈ సందర్భంగా బలంగా వినిపిస్తుంది!
అవును... ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ... అమిత్ షా ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. ఆయనతోపాటు మోడీపైనా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం, విమర్శల వాన కురిపించారు. ఈ సందర్భంగా... నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడమే కాదని, బాధ్యత కూడా తీసుకోవడం అంటూ చరకలేశారు!
ఈ సందర్భంగా... శత్రువులు ఎక్కడికీ వెళ్లలేని సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారో అమిత్ షా సమాధానం చెప్పలేదని మండిపడిన ప్రియాంక.. ఇలా ఆకస్మికంగా యుద్ధాన్ని ఆపడం దేశ చరిత్రలోనే మొదటిసారని అన్నారు. ఇక, ఆ ప్రకటన కూడా అమెరికా అధ్యక్షుడు చేయడం.. మన ప్రధాని బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తోందని.. మన దౌత్యం విఫలమైందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
మరోవైపు.. ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన జేడీ వాన్స్ పేరు ప్రస్థావించడం గమనార్హం. ఇందులో భాగంగా... మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో ఫోన్ లో మాట్లాడారని.. ఈ సందర్భంగా.. పాక్ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారని ప్రధాని తెలిపారు.
ఈ హెచ్చరికలపై తాను స్పందిస్తూ... పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని తాను జేడీ వాన్స్ కు చెప్పానని.. ఇదే సమయంలో.. పాక్ కు ఎవరు సాయం చేసినా చూస్తూ ఊరుకొనేది లేదని చెప్పామని.. బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానం చెప్తామని జేడీ వాన్స్ కు చెప్పామని.. పాక్ కు ఎవరు సహాయం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశామని ప్రధాని తెలిపారు.
ఇక... పాకిస్థాన్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్ నిలిపివేశామని ప్రధాని తెలిపారు. పాకిస్థాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులు చేసినా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని.. పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని ప్రధాని మోడీ హెచ్చరించారు.