ఆపరేషన్ సిందూర్ దాడి : పాక్ ఎఫ్-16 నష్టంపై అమెరికా మౌనం
ముఖ్యంగా ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఆరు ఎఫ్-16 యుద్ధ విమానాలను కోల్పోయిందన్న భారత వాదన తీవ్ర దృష్టిని ఆకర్షించింది.
By: A.N.Kumar | 14 Aug 2025 5:00 AM ISTకాశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ గణనీయమైన నష్టాన్ని చవిచూసిందని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ వెల్లడించిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఆరు ఎఫ్-16 యుద్ధ విమానాలను కోల్పోయిందన్న భారత వాదన తీవ్ర దృష్టిని ఆకర్షించింది.
భారత వైమానిక దళం ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ప్రకారం.. ఈ ఆపరేషన్‌లో పాక్‌లోని సుక్కూర్, జకోబాబాద్‌లో ఉన్న ఎఫ్-16 హ్యాంగర్లపై వైమానిక దాడులు జరిపారు. ఫలితంగా పాక్ యుద్ధవిమానాలు గాల్లోనూ, భూమిపైనా కూల్చివేయబడ్డాయని ఆయన స్పష్టం చేశారు.
అయితే పాకిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చి, భారత్ యుద్ధవిమానాలనే తాము కూల్చేశామని ప్రతివాదన చేస్తోంది. ఇంతే కాకుండా ఇరు దేశాల విమాన నష్టాలను స్వతంత్ర నిపుణుల బృందం ద్వారా లెక్కించుకుందాం అంటూ సవాలు విసిరింది.
-అమెరికా స్పందన "పాకిస్తాన్‌ను అడగండి"
ఆపరేషన్ సిందూర్ (మే 7–10, 2025)లో పాక్ ఎఫ్-16లు నిజంగా కూలిపోయాయా అన్న ప్రశ్నను NDTV అమెరికా విదేశాంగ శాఖను సంధించింది. దీనికి అమెరికా సూటిగా సమాధానమిస్తూ "ఆ విషయాన్ని పాకిస్తాన్‌కే అడగాలి" అని తప్పించుకుంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే.. పాకిస్తాన్‌లోని ఎఫ్-16 జెట్ల టెక్నికల్ ఆపరేషన్లు, మరమ్మతులు, ఉపయోగం అన్నీ అమెరికా కాంట్రాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఈ జెట్లను ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, వాటి స్థితి ఏమిటి వంటి పూర్తి సమాచారం 24/7 పాక్‌లో మోహరించి ఉన్న అమెరికా టెక్నికల్ సపోర్ట్ టీమ్ వద్దే ఉంటుంది. ఈ నేపధ్యంలో అమెరికా వద్ద వివరాలు లేకపోవడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది.
2019లో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ అనంతరం అమెరికా తన వర్గాల ద్వారా పాక్ ఎఫ్-16లు సురక్షితంగా ఉన్నాయని ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఆ సమాచారం తమ వద్ద లేదని చెప్పడం వెనుక పాక్‌తో పెరుగుతున్న దౌత్య సంబంధాలను దెబ్బతీయకూడదన్న ఉద్దేశమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ వాదనలు పరస్పరం విభిన్నంగా ఉన్నాయి. అమెరికా మౌనం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ఒకవైపు భారత్ ఆపరేషన్ సిందూర్‌లో పాక్ యుద్ధవిమానాలను కూల్చివేశామని ధృవీకరిస్తుంటే, మరోవైపు పాకిస్తాన్ ఆ ఆరోపణలను ఖండిస్తూ ప్రతిసవాలు విసురుతోంది. ఇక అమెరికా దాటవేతతో ఈ విషయం త్వరలో తేలే అవకాశాలు మరింత మసకబారుతున్నాయి.