పాక్ కు 5 + 1 షాక్ లు... 'ఆపరేషన్ సిందూర్' పై సంచలన ప్రకటన!
"ఆపరేషన్ సిందూర్"... పాకిస్థాన్ నమ్ముకున్న సైన్యానికి, పాకిస్థాన్ ను నమ్ముకున్న ఉగ్రవాదులకు భారత్ ఊహించని రీతిలో ఇచ్చిన బిగ్ స్ట్రోక్.
By: Raja Ch | 9 Aug 2025 2:00 PM IST"ఆపరేషన్ సిందూర్"... పాకిస్థాన్ నమ్ముకున్న సైన్యానికి, పాకిస్థాన్ ను నమ్ముకున్న ఉగ్రవాదులకు భారత్ ఊహించని రీతిలో ఇచ్చిన బిగ్ స్ట్రోక్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా అటు ఉగ్రవాదులను, వారికోసం రంగంలోకి దిగిన పాక్ సైన్యాన్ని భారత్ కొట్టిన చావుదెబ్బ. ఈ క్రమంలో పాక్ కు ఇచ్చిన మరో భారీ షాక్ గురించి తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ సంచలన ప్రకటన చేశారు.
అవును... జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దారుణానికి భారత్ ఆపరేషన్ సిందూర్ తో ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ ఘర్షణలో భారత్ కు భారీ నష్టం కలిగించామని పాక్ నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. దీనిపై భారత్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్లు వచ్చేశాయి. ఈ సమయంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్పందించారు.
ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలు కూల్చినట్లు భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో ఆ దేశానికి చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చినట్లు పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని తాజాగా స్పష్టం చేశారు.
ఆ సమయంలో... ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థలు బాగా పనిచేశాయని చెప్పారు. పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు వివరించారు. దీంతో... భారత్ మెగా సైనిక దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి జరిగిన నష్టానికి సంబంధించిన అతిగొప్ప ప్రకటనగా దీన్ని భావించొచ్చు!
బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.ఎమ్. కాత్రే స్మారక ఉపన్యాసంలో మాట్లాడిన అమర్ ప్రీత్ సింగ్... ఐఏఎఫ్ ఐదు పాకిస్తాన్ వైమానిక దళ యుద్ధ విమానాలను, ఒక వైమానిక ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ విమానాన్ని కూల్చివేసిందని అన్నారు. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు అద్భుతమైన పని చేశాయని ప్రశంసించారు.
ఈ సందర్భంగా... మే 7న దాడి చేయబడిన ఉగ్రవాద లక్ష్యాలకు సంబంధించి 'ముందు, తరువాత' ఉపగ్రహ చిత్రాలను కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ పంచుకున్నారు. ఇదే సమయంలో... అది చాలా హైటెక్ యుద్ధమని.. కేవలం 80-90 గంటల్లోనే లక్ష్యాల్లో చాలా వరకు సాధించామని.. ఈ నేపథ్యంలోనే భారీ మూల్యం తప్పదని పాక్ కు అర్ధమయ్యే కాళ్ల బేరానికి వచ్చారని అన్నారు.