జైలులో వివాహ వేడుక... తెరపైకి ఆసక్తికర విషయం!
ఒడిశాలోని గంజాం జిల్లాలో అత్యాచార నిందితుడు సబ్ జైలు ఆవరణలో బాధితురాలిని వివాహం చేసుకున్న ఘటన తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 29 April 2025 8:30 PM ISTఒడిశాలోని గంజాం జిల్లాలో అత్యాచార నిందితుడు సబ్ జైలు ఆవరణలో బాధితురాలిని వివాహం చేసుకున్న ఘటన తెరపైకి వచ్చింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు, జైలు అధికారులు హాజరవ్వగా.. జైలు గోడల లోపల వేడుక వాతావరణాన్ని సృష్టించారు.
అవును... ఒడిశాలోని కోడలా సబ్ జైలులో ఓ ఆసక్తికర విషయం జరిగింది. ఇందులో భాగంగా.. జైలు గోడల మధ్య వివాహ వేడుక జరిగింది. ఈ వివాహం.. అత్యాచార నిందితుడికి, సబ్ జైలు ఆవరణలో కుటుంబ సభ్యులు, ప్రముఖులు, జైలు అధికారుల మధ్య ఆ అత్యాచార బాధితురాలికి మధ్య జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... సూర్యకాంత్ బెహెరా (26) అనే వ్యక్తి గుజరాత్ లోని సూరత్ లో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో అతనిపై ఓ మహిళ అత్యాచార ఫిర్యాదు చేసింది. దీంతో... గత సంవత్సరం నవంబర్ లో అరెస్టై కోడలా సబ్ జైలులో విచారణలో ఉన్నాడు. ఈ సందర్భంగా స్పందించిన వధువు తరుపు న్యాయవాది పీకే మిశ్రా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.
ఇందులో భాగంగా... ఇరు కుటుంబాల మధ్య ఉన్న అపార్థాల కారణంగానే 22 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు పరస్పర ఒప్పందానికి రావడంతో వివాహం ద్వారా తమ సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో... కోడలా జైలర్ తరినిసేన్ దేహూరి మాట్లాడుతూ... తగిన అనుమతులు పొందిన తర్వాత అన్ని చట్టపరమైన లాంఛనాలకు అనుగుణంగా వివాహం జరిగిందని వివరించారు. సంప్రదాయ హిందూ ఆచారాలను అనుసరించి జరిగిందని.. ఈ సమయంలో పెద్దలు జంటను ఆశీర్వదించారని వెల్లడించారు.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ వివాహ వేదిక వద్దకు వరుడిని జైలు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలంకరించిన ఎలక్ట్రిక్ వాహనంలో తీసుకుని రావడం గమనార్హం. ఈ సందర్భంగా ఈ వేడుకకు, వివాహ దుస్తులు సహా అన్ని ఇతర ఖర్చులను కుటుంబ సభ్యులే భరించారు.
ఇక ఈ వివాహ వేడుక అనంతరం నిందితుడు సూర్యకాంత్ బెహెరాను తిరిగి జైలు గదిలోకి పంపించగా.. వధువు ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన వరుడు తండ్రి... తమ కుమారుడు త్వరలో విడుదల అవుతాడని, ఈ జంట జైలు గోడల వెలుపల సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.