Begin typing your search above and press return to search.

చెట్టుపై కూర్చొని కెమెరాలో బంధించి.. ఉగ్రదాడి సంచలన వీడియో

కశ్మీర్ అందాల లోయ పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్ర దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేతికి అత్యంత కీలకమైన వీడియో ఒకటి చిక్కింది.

By:  Tupaki Desk   |   27 April 2025 10:10 PM IST
NIA Uncovers Key Evidence in Pahalgam Terror Attack
X

కశ్మీర్ అందాల లోయ పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్ర దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేతికి అత్యంత కీలకమైన వీడియో ఒకటి చిక్కింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ భయంకరమైన దాడి మొత్తాన్ని చిత్రీకరించిన స్థానిక వీడియో గ్రాఫర్ ఒకరు భద్రతా బలగాల దర్యాప్తులో కీలక సాక్షిగా మారాడు.

కాల్పులు ప్రారంభమైనప్పుడు, ఆ వీడియో గ్రాఫర్ తన ప్రాణ రక్షణ కోసం సమీపంలోని ఒక చెట్టుపైకి ఎక్కి దాక్కున్నాడు. ఆ సురక్షిత ప్రాంతం నుండే ఆయన తన కెమెరాలో ఈ దాడి మొత్తాన్ని చిత్రీకరించాడు. ఈ వీడియో ఇప్పుడు NIAకి దర్యాప్తులో ఒక ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతోంది.

NIA అధికారులు ఆ వీడియో గ్రాఫర్‌ను విచారించి, ఆయన నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి, లోయలో వేర్వేరు దిక్కుల నుండి కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకులను ముస్లిం మతాచారంలోని కల్మా పఠించమని బెదిరించి, ఆ తర్వాత నలుగురిని అతి కర్కశంగా కాల్చి చంపినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం జిప్ లైన్ ప్రాంతం దగ్గర ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా కాల్పులు జరిపి రక్తపాతాన్ని మరింత తీవ్రతరం చేశారు.

ఘటనా స్థలంలో NIA అధికారులు AK-47 , M4 రైఫిళ్లకు చెందిన ఖాళీ తూటాలను గుర్తించారు. ఉగ్రవాదులు దాడి సమయంలో స్థానికుల నుండి రెండు సెల్ ఫోన్లను కూడా లాక్కున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిని ట్రాక్ చేయడం ద్వారా ఉగ్రవాదుల లొకేషన్లను కనుగొనే అవకాశం ఉంది. అయితే, దాడి తర్వాత నుంచి ఈ ఫోన్లు స్విచ్ఛాఫ్‌లోనే ఉన్నాయని అధికారులు గుర్తించారు.

ఈ దాడిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు మరియు ఒక స్థానిక ఉగ్రవాది ఈ దాడిలో పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. స్థానిక ఉగ్రవాదిని ఆదిల్ థోకర్‌గా భద్రతా బలగాలు గుర్తించాయి. థోకర్ 2018లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరి, పాకిస్తాన్‌లో శిక్షణ పొందాడు. 2024లో కాశ్మీర్ లోయకు తిరిగి వచ్చే ముందు లష్కరే తోయిబాతో యుద్ధ శిక్షణ కూడా పొందినట్లు తెలిసింది. తిరిగి వచ్చినప్పటి నుంచి థోకర్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు లాజిస్టిక్ సహాయం అందిస్తూ, కాశ్మీర్ భౌగోళిక స్వరూపంపై వారికి సమాచారం ఇస్తున్నాడు.

ఉగ్రవాదులు అత్యంత క్లిష్టతరమైన హిమాలయాలు, దట్టమైన అరణ్యాల గుండా దాదాపు 20-22 గంటలు ప్రయాణించి కోకెర్నాగ్ అడవుల నుండి బైసరన్ లోయకు చేరుకుని ఈ ప్రాణాంతక దాడిని అమలు పరిచినట్లు తెలుస్తోంది.

NIA ఈ కేసును లోతుగా విచారిస్తోంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి , ప్రత్యక్ష సాక్షుల నుండి సమాచారాన్ని సేకరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఉగ్రవాదులు లోయలోకి ఎలా ప్రవేశించారు, దాడి తర్వాత ఎలా పారిపోయారు అనే విషయాలపై నిశితంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియో , ఇతర ఆధారాలతో, NIA ఈ దారుణ దాడి వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించే ప్రయత్నం చేస్తోంది.