మేటర్ సీరియస్.. దేశ వ్యతిరేక పోస్టులపై ఎన్ఐఏ సరికొత్త వ్యూహం ఇదే!
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2025 3:28 PM ISTజమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ, గ్యాంగ్ స్టర్ గోల్డీ బార్ వంటి వారి వీడియోలపైనా నిషేధం విధించింది. ఈ సమయంలో సరికొత్త వ్యూహాలతో వీటి కట్టడికి నిర్ణయాలు తీసుకోనుంది!
అవును... దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక కంటెంట్ ను పోస్ట్ చేసేవారిపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ తరహా కంటెంట్ ను కట్టడి చేసే విషయంలో ఇతర ఏజెన్సీలతో కలిసి ఖలిస్థానీ, దేశ వ్యతిరేక పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కంటెంట్ ను కట్టడిచేసేందుకు కొత్త చట్టంతో సీరియస్ యాక్షన్ మొదలుపెట్టబోతోందని అంటున్నారు.
ఇందులో భాగంగా... ఈ తరహా కంటెంట్ ను కట్టడి చేసే ప్రణాళికలో భాగంగా కొత్త చట్టం రూపొందించి.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు వాటి బాధ్యతల గురించి అధికారికంగా తెలియజేస్తారు. ఇదే సమయంలో... ఈ తరహా పోస్టులపై ఆయా సంస్థలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సి ఉంటుంది.
అదేవిధంగా... ఈ తరహా పోస్టులు పెట్టేవారు విదేశాలలో ఉన్నా సరే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. విదేశీయులు చేసిన దేశ వ్యతిరేక పోస్టులను రీపోస్టు చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో... రెచ్చగొట్టే ధోరణితో ఉండే పోస్టులను బ్లాక్ చేసేలా ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఈ విషయంలో సదరు సోషల్ మీడియా అకౌంట్ హోల్డర్స్ పై తీసుకోవాల్సిన చర్యలను త్వరలో ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. వీటిపై ఇప్పటికే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ, న్యాయ మంత్రిత్వశాఖ, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా... పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలోని పాకిస్థాన్ గూఢచారులను గుర్తించేందుకు ఎన్ఐఏ చర్యలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సోషల్ మీడియాలోని అనుమానాస్పద కదలికల ఆధారంగా ఇప్పటివరకు అనేకమంది పాకిస్థాన్, ఖలిస్థానీ ఉగ్రవాదుల మద్దతుదారులను అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టతో ఈ తరహా పోస్టులకు చెక్ పెట్టాలని భావిస్తోంది!