Begin typing your search above and press return to search.

నెల్లూరు ఫైట్ : అనిల్ యాదవ్ Vs పవన్

నెల్లూరు నగరంలోని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

By:  Tupaki Desk   |   8 July 2025 3:09 PM IST
నెల్లూరు ఫైట్ : అనిల్ యాదవ్ Vs పవన్
X

నెల్లూరు నగరంలోని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో లేని సమయంలో జరిగిన దాడిపై వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది. చర్యకు ప్రతి చర్య ఉంటుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎంపీ వేమిరెడ్డి దంపతులు ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. అయితే మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. మాజీ ఎమ్మెల్యేపై చర్యలు ఉంటాయని సంకేతాలిచ్చారు. దీంతో నెల్లూరు రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది.

నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి ప్రతిచర్య ఉంటుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. అయితే చర్య ఎవరిది? ప్రతి చర్యకు దిగాల్సినది ఎవరు అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటంతోనే దాడి జరిగిందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఇంతవరకు దాడి చేసింది ఎవరన్నది పోలీసులు నిర్ధారించలేదు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో ఓ ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి జరగడం సంచలనం సృష్టించినా, అందుకు దారి తీసిన పరిణామాలు కూడా పెద్ద చర్చకు కారణమవుతున్నాయి.

గత ఎన్నికల్లో ప్రశాంతి రెడ్డిపై ఓడిన నల్లపురెడ్డి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఏడాదిగా ఓటమి భారంతోనే నెట్టుకొస్తున్న నల్లపురెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ విధానాలు, ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నించాల్సిన ఆయన సహనం కోల్పోయి మహిళా నేతపై వ్యక్తిగత దూషణలకు దిగడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు నల్లపురెడ్డి ఇంటిపై దాడికి దిగినట్లు చెబుతున్నారు. మరోవైపు నల్లపురెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం పెద్ద సంఖ్యలో మహిళలు నిరసనకు దిగారు.

దాడి జరిగిన వెంటనే నల్లపురెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి చేసిన వ్యక్తులు ఎవర్నది పోలీసులు నిర్ధారించకుండానే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఆయన టార్గెట్ చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. దాడికి దిగింది ఎంపీ అనుచరులే అంటూ మాజీ మంత్రి అనిల్ నిర్ధారించారంటే.. దాడికి దారితీసిన కారణాలపైనా ఆయనకు అవగాహన ఉండే ఉంటుందని అంటున్నారు. దాడిని ఖండిస్తూనే నల్లపురెడ్డి వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపడితే బాగుండేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక నెల్లూరు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకమైనవి. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడతారా?’’ అంటూ పవన్ ప్రశ్నించారు.

తాజా పరిణామాలతో నెల్లూరు పాలిటిక్స్ హీటెక్కాయి. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు, టీడీపీ కార్యకర్తల ప్రతిచర్యతో నెల్లూరు రాజకీయం గరం గరంగా మారిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. మరోవైపు తనపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘాటుగా స్పందించారు. నల్లపురెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశాలను టీడీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ భార్య భారతీరెడ్డిపై వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ కార్యకర్త కిరణ్ ను అరెస్టు చేసినట్లే.. ప్రతిపక్షం తప్పుచేసినా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.