సామాన్యుడి ట్వీట్.. లోకేష్ రియాక్షన్ స్పాట్.. యాక్షన్ స్టార్ట్!
ఈ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ 100% మార్కులు తెచ్చుకుంటూనే ఉన్నారు! సమస్య ఉందని, సమస్యగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన దృష్టికి తీసుకెళ్తే చాలు.. నిమిషాల వ్యవధిలో, గడియారంలో చిన్నముళ్లు అంకె దాటే లోపు రియాక్షన్ వచ్చేస్తోంది.
By: Tupaki Desk | 24 Jun 2025 4:19 PM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు మారాలి, వారిని పాలించే నేతలూ మారాలి అని అంటారు. ప్రధానంగా ఒకప్పుడు ఒక ఎమ్మెల్యేనో, మంత్రినో నేరుగా కలవాలంటే అదో పెద్ద ప్రహాసనం అని చెప్పేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో.. సమస్యను నాయకుడికి చెప్పడం పెద్ద విషయం కాదు. కాకపోతే.. వారు ఎప్పటికి రియాక్ట్ అవుతారు అనేది అసలు పాయింట్.
ఈ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ 100% మార్కులు తెచ్చుకుంటూనే ఉన్నారు! సమస్య ఉందని, సమస్యగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన దృష్టికి తీసుకెళ్తే చాలు.. నిమిషాల వ్యవధిలో, గడియారంలో చిన్నముళ్లు అంకె దాటే లోపు రియాక్షన్ వచ్చేస్తోంది. క్యాలెండర్ లో తేదీ మారేలోపు పరిష్కారం కనిపిస్తొంది! ఈ క్రమంలో తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది.
అవును... ఈ నెల 23న "యువత పోరు"తో వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. కూటమి నేతలు అధికరంలోకి వచ్చిన తర్వాత యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇవ్వని పక్షంలో రూ.3,000 నెల నెలా నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని.. అది ఏమాత్రం అమలు చేయలేదని ఆరోపించింది.
దీనికి నిరసనగా... ప్రతీ జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాకు పిలుపునిచ్చింది! అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం చేసింది. ఈ నేపథ్యంలో... పార్వతీపురం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ విద్యార్థులను ఈ రాజకీయ నిరసనలో పాల్గొనడానికి తీసుకెళ్లారని ఒక సామాన్య వ్యక్తి శ్యామ్ ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ కి విన్నవించారు.
ఈ సందర్భంగా... "గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ లో జరిగిన ఒక ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిన్న, స్కూల్ యూనిఫామ్ లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు" అని తెలిపారు.
అయితే... "షాకింగ్ గా ఎంఈవో, హెడ్ మాస్టర్ ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు. తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఎంఈవో, హెడ్ మాస్టర్ బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి" అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్ ని సదరు శ్యామ్ అనే వ్యక్తి ఉదయం 11:47 కి పోస్ట్ చేస్తే.. మధ్యాహ్నం 12:40 కళ్లా స్పందించిన మంత్రి లోకేష్... "ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలి" అని స్పందించారు.
ఇదే సమయంలో.. "ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం" అని ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్!