మంగళగిరిలో బ్రాహ్మణి సందడి.. ఫొటోలు వైరల్
టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి మంగళగిరిలో బుధవారం పర్యటించారు. ఆకస్మికంగా మంగళగిరి వచ్చిన ఆమె స్థానిక మహిళలతో సమావేశమయ్యారు
By: Tupaki Desk | 13 Aug 2025 8:14 PM ISTటీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి మంగళగిరిలో బుధవారం పర్యటించారు. ఆకస్మికంగా మంగళగిరి వచ్చిన ఆమె స్థానిక మహిళలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నామని, తన భార్య బ్రాహ్మణి మంగళగిరిలో కొనుగోలుచేసిన చీర వైరల్ అయ్యిందని ఇటీవల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణి పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
మంగళగిరి చేనేత చీరలను చాలా ఇష్టపడే బ్రాహ్మణి నూతన డిజైన్లతో తయారు చేసిన చీరలను పరిశీలించారు. అనంతరం కాజ గ్రామంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి మహిళలతో కాసేపు సరదాగా మాట్లాడారు. తర్వాత మంగళగిరిలో చిన్నారుల కోసం నిర్మించిన పార్కును సందర్శించారు. పార్కులో కాసేపు సరదాగా ఉయ్యాల ఊగారు. శ్రీపానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన ఉచిత బస్సును పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. ఏబైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అంతా బాగానే ఉందని వారు సమాధానమిచ్చారు.
ఇక మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ గెలిచిన నుంచి ఆయన కుటుంబం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 2019లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన లోకేశ్ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. గత ఎన్నికల్లో 90 వేలకు పైగా ఓట్లతో గెలిచి రాష్ట్రంలోనే అత్యధిక మూడో మెజార్టీ తెచ్చుకున్నారు. టీడీపీకి ఏమాత్రం అనుకూలం కాని మంగళగిరిలో పార్టీ పునాదులు బలోపేతం చేసి, తనకు కంచుకోటగా మార్చుకోవాలనే ప్రయత్నంలో మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటున్నారు లోకేశ్. అదే సమయంలో లోకేశ్ భార్య బ్రాహ్మణి సైతం మంగళగిరి వాసులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడంతో రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.