జూనియర్ దగ్గుబాటికి లైన్ క్లియర్ చేస్తున్న లోకేష్
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినపుడు ఆయన వెంట ఉన్నది పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రమే.
By: Tupaki Desk | 24 Jun 2025 8:00 PM ISTతెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినపుడు ఆయన వెంట ఉన్నది పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రమే. ఆనాడు చిన్నల్లుడు చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ కి అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉమ్మడి ఏపీ అంతటా సభలూ సమావేశాల నిర్వహణ బాధ్యతలతో పాటు అన్న గారి అభిమానులను సంఘటితం చేయడం పార్టీ కార్యకర్తలుగా మలచడంతో దగ్గుబాటి పాత్ర ఎన్నతగినది అని చెబుతారు.
అనుకున్న విధంగా ఎన్టీఆర్ తొమ్మిది నెలలలో ఏపీలో అధికారం చేపట్టారు. ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ తరువాత 1984 నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ ముందున చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారు. నాటి నుంచి టీడీపీలో ఇద్దరు అల్లుళ్ళూ రెండు శిబిరాలుగా పార్టీ ఉండేది. చంద్రబాబు పార్టీ ఆఫీసులో ఉంటూ కార్యాచరణ సిద్ధం చేస్తూంటే దగ్గుబాటి జనంలో ఉంటూ క్యాడర్ ని కలిసేవారు.
ఇక ఇద్దరు అల్లుళ్ళూ ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. ఇద్దరికీ పోటా పోటీగా ఉండేది. అసలు పడేది కాదని ఆనాటి టీడీపీ పాత కాపులు చెబుతారు. అయితే అన్న గారిని అధికారం నుంచి దించే కార్యక్రమంలో 1995లో మాత్రం ఇద్దరు అల్లుళ్ళూ ఒక్కటి అయిపోయారు. ఆ తరువాత దగ్గుబాటి కొద్ది నెలలకే తిరిగి ఎన్టీఆర్ వైపు వచ్చారు. ఇక ఎన్టీఆర్ మరణం తరువాత నాటి నుంచి ఆయన బీజేపీ కాంగ్రెస్ వైసీపీ ఇలా పార్టీలు మారినా రాజకీయంగా మాత్రం గ్రాఫ్ పెరగలేదు. మొత్తానికి రాజకీయ విరామం ప్రకటించారు.
నిజానికి టీడీపీ పునాది నుంచి ఉన్న దగ్గుబాటి తన వారసుడిని కూడా రాజకీయాల్లోకి తేవాలని అనుకున్నారు. టీడీపీని వదిలేయడం వల్ల అది సాధ్యపడలేదు. 2019లో వైసీపీ తరఫున దగ్గుబాటి హితైష్ రాజకీయ అరంగేట్రం చేస్తారు అని అంతా భావించారు. కానీ ఆయనకు అప్పటికి భారత పౌరసత్వం లేకపోవడంతో దగ్గుబాటే పోటీ చేయాల్సి వచ్చింది. అలా ఆ ఎన్నికల్లో దగ్గుబాటి గెలిచి ఉంటే ఏమి జరిగేదో కానీ ఓటమి పాలు అయ్యారు
హితైష్ పేరు కూడా నాటి నుంచి రాజకీయంగా పెద్దగా వినిపించడం లేదు. అయితే ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు హితైష్ తల్లి అయిన పురంధేశ్వరి తన కుమారుడి రాజకీయ అరంగేట్రం మీద ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. హితైష్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే ప్రోత్సహిస్తామని అన్నారు. ఇక 2024 లో పర్చూరు నుంచి పోటీకి హితైష్ ప్రయత్నించారు అని ప్రచారం జరిగింది. కానీ అక్కడ సీనియర్ ఎమ్మెల్యేగా ఏలూరి సాంబశివరావుకే టికెట్ దక్కింది. ఆయన 2014 నుంచి వరసబెట్టి గెలుస్తూ వస్తున్నారు.
దాంతో పాటు పార్టీకి నిబద్ధత కలిగిన వారు. అయితే హితైష్ 2029లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వవచ్చు అని అంటున్నారు. 2027లో అసెంబ్లీ నియోజకవర్గాలా పునర్ విభజన జరుగుతుందని అలా పర్చూరు కూడా రెండుగా మారితే ఒక దాని నుంచి హితైష్ బరిలోకి దిగుతారు అని అంటున్నారు. ఇక లోకేష్ కూడా హితైష్ రాజకీయ ప్రవేశానికి పచ్చ జెండా ఊపుతున్నారనే అంటున్నారు
మునుపటిలా దగ్గుబాటి చంద్రబాబుల మధ్య విభేదాలు లేవు. విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో దగ్గుబాటి రాసిన పుస్తకాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరించారు ఇద్దరూ చాలా కాలం తరువాత దగ్గరై ఇక మీదట కలిసే ఉంటామని చెప్పారు. సో అలా దగ్గుబాటి నారా కుటుంబాలు ఒక్కటైన వేళ జూనియర్ దగ్గుబాటికి టీడీపీలో ప్రవేశం కానీ టికెట్ కానీ ఈజీగానే దొరుకుతుందని అంటున్నారు.
తాజాగా చూస్తే కనుక హితైష్ స్థాపించిన సైనిక స్కూల్ ని లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు అన్నదమ్ములూ నవ్వులు చిందిస్తూ కనిపించారు. చెప్పాలంటే హితైష్ కూడా ఎన్టీఆర్ మనవడే. అలా హితైష్ రాజకీయ ఎంట్రీ 2029లో ఉంటుందని అంతా భావిస్తున్నారు ఈ లోగానే ఆయనకు టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఆయన లోకేష్ టీం లో ముఖ్య పాత్ర పోహ్షిస్తారు అని చెబుతున్నారు.