ధోని నిజంగా 5 లీటర్ల పాలు తాగేవాడా?
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని.. ప్రొఫెషనల్ క్రికెట్లోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది.
By: Tupaki Desk | 23 April 2025 3:00 PM ISTభారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని.. ప్రొఫెషనల్ క్రికెట్లోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పటికీ ఐపీఎల్ లాంటి అత్యంత పోటీ ఉన్న క్రికెట్ లీగ్‌లో కొనసాగుతూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో చెన్నై ఒడుదొడుకులతో సాగుతున్నప్పటికీ.. ధోని మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో చెన్నైకి ధోనీనే సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ల మధ్య విరామంలో పాల్గొన్న ఒక ప్రైవేటు కార్యక్రమంలో తన గురించి జనంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్న ఓ రూమర్ గురించి ధోని క్లారిటీ ఇవ్వడం విశేషం. 20 ఏళ్ల ముందు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టినపుడు ధోని గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. అతను అంత బలంగా షాట్లు కొట్టడానికి, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడడానికి లీటర్ల కొద్దీ పాలు తాగడమే కారణమని మీడియాలో వార్తలొచ్చాయి. రోజుకు ఏకంగా నాలుగైదు లీటర్ల పాలు తాగుతాడని ధోని గురించి మాట్లాడుకునేవాళ్లు. కానీ దీని గురించి ధోని క్లారిటీ ఇచ్చేశాడు. తాను రోజుకు లీటర్ పాలే తాగేవాడినని.. అది కూడా దశల వారీగానే అని.. ఐదు లీటర్లు అనేది అతిశయోక్తి అని ధోని చెప్పాడు. ఇక తాను లస్సీని వాషింగ్ మెషీన్లో దాచుకుని తాగేవాడినన్న రూమర్ గురించి కూడా ధోని క్లారిటీ ఇచ్చాడు. అసలు తనకు లస్సీ తాగే అలవాటే లేదని.. ఇక వాషింగ్ మెషీన్లో దాచుకుని తాగడం ఏంటని ధోని అన్నాడు. మొత్తానికి ధోని నాలుగైదు లీటర్లు పాలు తాగడం వల్లే క్రికెట్లో ఎదిగాడని అతణ్ని అనుకరించడానికి ట్రై చేసిన చాలామందికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. రోజుకు లీటర్ పాలు తాగడమే ఎక్కువంటే.. ధోని మరీ నాలుగైదు లీటర్లు తాగుతాడని అప్పట్లో ప్రచారం చేయడం, దీని గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు రావడం గమనార్హం.