మాది డెడ్ ఎకానమీనా? ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘‘భారత్ డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా బలమైన కౌంటర్ ఇచ్చారు.
By: A.N.Kumar | 2 Aug 2025 3:17 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘‘భారత్ డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా బలమైన కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత ఆర్థికవ్యవస్థ డెడ్ ఎకానమీ కాదని.. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారబోతున్న ఉత్సాహవంతమైన వ్యవస్థ’’ అని మోదీ స్పష్టంగా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచం అంతా అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత్ తన దిశను తప్పకుండా కొనసాగిస్తోందన్నారు. ‘‘ఇప్పుడు మన ప్రయోజనాలపైనే దృష్టి పెట్టాల్సిన సమయం. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడకుండా మనమే తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు.
ట్రంప్ విమర్శల నేపథ్యం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్–రష్యా సంబంధాలపై స్పందిస్తూ ‘‘రష్యా, భారత్ రెండు డెడ్ ఎకానమీలు.. మునగనీయండి’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అదనపు పెనాల్టీలు విధిస్తామంటూ హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ చేసిన ‘‘భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారనుంది’’ అన్న వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రపంచంలోనూ వృద్ధి రేటు అత్యధికంగా ఉన్న దేశాలలో భారత్ ముందుండడాన్ని ఆయన గుర్తు చేశారు.
సిందూర్‌పై విమర్శలపై స్పందన
సమావేశంలో ప్రధాని మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ , ఇతర ప్రతిపక్షాలు తక్కువచేసేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘‘పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ నిర్వహించగా.. దేశ ప్రజలంతా గర్వపడాల్సిన సందర్భంలో కొందరు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘సిందూర్’ అనే పేరు కూడా వారికే ఇబ్బందిగా మారింది. దేశ రక్షణకు ప్రాణాలర్పించే జవాన్లను అవమానించే స్థాయికి వెళ్లారు. ఇది సిగ్గుచేటు’’ అని మోదీ మండిపడ్డారు.
-ఆపరేషన్ మహాదేవ్‌పై వ్యాఖ్య
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్’ను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘మహాదేవుడి ఆశీస్సులతో పహల్గాంలో ఉగ్రవాదులను ఖతం చేసాం. కానీ కొందరు ఆ సమయాన్ని కూడా అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు దొరికినప్పుడు వారాలు చూసుకోవాలా? పారిపోవడానికి అవకాశం ఇవ్వాలా?’’ అని ప్రశ్నించారు.
మోదీ వ్యాఖ్యలన్నీ ట్రంప్ చేసిన విమర్శలకు ప్రతిగా మాత్రమే కాకుండా, దేశీయ ప్రతిపక్షాలపై కూడా వ్యూహాత్మకంగా దాడిగా మలిచినట్లయ్యాయి. దేశ ఆర్థిక అభివృద్ధిని అన్వయిస్తూ, దేశభక్తిని కలిపిన మోదీ ప్రసంగం, భవిష్య రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.