Begin typing your search above and press return to search.

"భారత్‌ - పాక్‌ సీజ్ ఫైర్ లో అమెరికా పాత్ర"పై తేల్చి చెప్పిన మోడీ!

ఇందులో భాగంగా... భారత్ - పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరిందని.. దీనికోసం అమెరికా మధ్యవర్తిత్వం ఫలించిందని..

By:  Tupaki Desk   |   18 Jun 2025 11:31 AM IST
భారత్‌ - పాక్‌  సీజ్  ఫైర్  లో అమెరికా పాత్రపై తేల్చి చెప్పిన మోడీ!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తొలుత ఉగ్ర శిబిరాలను, ఉగ్రమూకలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ కాలు దువ్వడంతో.. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. పాక్ సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని భారత్ వణికించేసింది. ఈ సమయంలో ట్రంప్ నుంచి ఓ పోస్ట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

ఇందులో భాగంగా... భారత్ - పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరిందని.. దీనికోసం అమెరికా మధ్యవర్తిత్వం ఫలించిందని.. రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య ఉద్రిక్త వాతావారణం ఉండకూడదనే తాను ఈ ప్రయత్నం చేశానని పోస్ట్ చేశారు. దీంతో.. అప్పటి వరకూ గర్వంగా ఉన్నట్లు కనిపించిన భారతీయుడు సడన్ గా కోపొద్రిక్తుడవ్వడం మొదలైందని అంటారు!

ఈ విషయంపై అటు సోషల్ మీడియా వేదికగా మోడీ సర్కార్ పై విమర్శలు కనిపించాయి. ప్రతిపక్ష 'ఇండియా కూటమి' సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వినిపించాయి. యుద్ధం ఆపడానికి గల కారణాలు చెప్పాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్.. వాణిజ్యాన్ని చూపించి సీజ్ ఫైర్ కి ఒప్పించినట్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మోడీ స్పందించారు!

అవును... భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను తామే ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల పదేపదే చెప్పుకుంటోన్న వేళ.. ట్రంప్‌ ప్రకటనపై స్పష్టతనివ్వాలని అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్‌ చేస్తోన్న నేపథ్యంలో.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తొలిసారిగా దీనిపై స్పందించారు. భారత్‌ - పాక్‌ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు.

తాజాగా ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందించిన మిస్రీ... పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో "భారత్ - అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని.. సీజ్ ఫైర్ గురించి భారత్ - పాక్ మధ్య మిలటరీ స్థాయి చర్చలు మాత్రం జరిగాయని" మోడీ తెలిపారని మిస్రీ వివరించారు.

ఇదే సమయంలో.. "పాకిస్థాన్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ను నిలిపివేశామని.. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్‌ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోడీ స్పష్టంగా చెప్పారని.. ఈ విషయంపై భారత్‌ లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని" మిస్రీ వివరించారు.

కాగా.. జీ7 శిఖరాగ్ర సదస్సు నుంచి ఆగమేఘాల మీద ట్రంప్ అమెరికాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సదస్సులో మోడీ - ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు ముందుగానే వెళ్లిపోవడంతో వీరు సమావేశం కాలేకపోయారు. దీంతో.. ట్రంప్ - మోడీ.. 35 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు.