Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సిందూర్ తర్వత మోదీ ఓ విదేశీ టూర్.. మరో విదేశానికి షాక్?

11 ఏళ్ల తన ప్రధానమంత్రిత్వంలో నరేంద్ర మోదీ 75 పైగా దేశాల్లో పర్యటించారు. ఏ భారత ప్రధాని పర్యటించని దేశాలకూ వెళ్లారు.. మంగోలియా వంటి దేశాన్ని కూడా సందర్శించారు..

By:  Tupaki Desk   |   15 Jun 2025 6:15 PM IST
ఆపరేషన్ సిందూర్ తర్వత మోదీ ఓ విదేశీ టూర్.. మరో విదేశానికి షాక్?
X

11 ఏళ్ల తన ప్రధానమంత్రిత్వంలో నరేంద్ర మోదీ 75 పైగా దేశాల్లో పర్యటించారు. ఏ భారత ప్రధాని పర్యటించని దేశాలకూ వెళ్లారు.. మంగోలియా వంటి దేశాన్ని కూడా సందర్శించారు.. దీంతోపాటు చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్ఠం చేశారు. యుద్ధంలో మునిగిపోయిన రష్యా, ఉక్రెయిన్ లనూ సందర్శించారు మోదీ.. అయితే, మాల్దీవ్స్ నుంచి అమెరికా వరకు ఎన్నో టూర్లు చేసిన మోదీ.. ఇప్పుడు చెయ్యబోయే టూర్ మాత్రం స్పెషల్ అని చెప్పాలి.

భారత్ కు శత్రువని చెప్పలేం కానీ... భారత్ తో స్నేహం చేయాలని భావించని దేశం తుర్కియే. మరీ ముఖ్యంగా తుర్కియే ఎర్డోగాన్ పాలనలోకి వెళ్లాక మన దేశం పట్ల వ్యతిరేకత కనబరిచింది. చారిత్రకంగా పేరున్న తుర్కియే నాటో సభ్య దేశం కూడా. అయితే, 2019లో మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు తుర్కియే వ్యతిరేకించింది. అంతేకాదు.. మొన్నటి ఆపరేషన్ సిందూర్ కూ తుర్కియే నుంచి మద్దతు రాలేదు. ఒకవిధంగా చెప్పాలంటే అంతర్జాతీయ సంబంధాల్లో తుర్కియే మనకు వ్యతిరేకి.

అలాంటి దేశాన్ని మోదీ ఊరకే ఎందుకు వదులుతారు? మాల్దీవ్స్ మంత్రులు చేసిన విమర్శలకు ఆ దేశానికి ఆయువుపట్టయిన పర్యటకాన్ని కుదేలు చేసి కోలుకోలేని దెబ్బకొట్టారు మోదీ.. ఇప్పుడు తుర్కియేకు కూడా అలాంటి షాక్ ఒకటి ఇవ్వనున్నారు.

కెనడాలో జరిగే జీ7 సమ్మిట్ కు మోదీ వెళ్తున్నారు. దారి మధ్యలో సైప్రస్ అనే దేశాన్ని సందర్శించనున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోదీనే కావడం గమనార్హం. క్రొయేషియాలోనూ మోదీ పర్యటన ఉంది. ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం

సోమవారం నుంచి మోదీ టూర్ మొదలుకానుంది. తొలిగా సైప్రస్ వెళ్తారు. పెహల్గాంలో పర్యటకులను కాల్చి చంపిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఉన్మాదానికి ఆపరేషన్ సిందూర్ తో కోలుకోలేని సమాధానం ఇచ్చిన మోదీ.. ఈ తర్వాత చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. కాగా, సైప్రస్ ఎక్కడి ఉంది అని చూస్తే.. ఇది తుర్కియే పొరుగు దేశం. అంతేకాదు ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు మద్దతు ఇచ్చింది. 1974లో ఈ దేశ ఉత్తర భాగాన్ని తుర్కియే ఆక్రమించింది. అలాంటి దేశానికి మోదీ వెళ్లడం అంటే తుర్కియేకు చురకే అనుకోవాలి.

తన పర్యటనలో మోదీ సైప్రస్ ప్రభుత్వంలో ఆయుధాలు, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపనున్నారు. తద్వారా.. సైప్రస్ ను ఆయుధపరంగా బలోపేతం చేయనున్నారు. అంతేకాక మీ పక్క దేశంతో మాకు సత్సంబంధాలు ఉన్నాయంటూ తుర్కియేకు కూడా ఓ హెచ్చరిక చేయనున్నారు.