పాకిస్థాన్ బిత్తరపోయి.. అడుక్కుంది: మోడీ సంచలన వ్యాఖ్యలు
`ఆపరేషన్ సిందూర్`పై విపక్షాలు లేవనెత్తిన సందేహాలకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
By: Garuda Media | 30 July 2025 10:37 AM IST`ఆపరేషన్ సిందూర్`పై విపక్షాలు లేవనెత్తిన సందేహాలకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఒక వైపు.. విపక్షంపై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు ఆపరేషన్ సిందూర్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని చెప్పారు. ``తొలి రోజు(మే7) ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టినప్పుడు.. పాకిస్థాన్ బిత్తరపోయింది. మనం ఆపరేషన్ చేపట్టే సమయంలో ఆ దేశ ప్రధాని.. ఎక్కడున్నాడో అందరికీ తెలిసిందే. సైన్యాద్యక్షుడు కూడా చెమటలు కక్కుకుంటూ.. ఆయనను కలిశాడు. ఇదీ.. మనసత్తా!`` అని ప్రధాని పేర్కొన్నారు.
రెండో రోజుకు పాకిస్థాన్ మనపై దొడ్డిదారిలో యుద్ధానికి ప్రయత్నించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాలను.. లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించినా.. మన సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వాటిని నేలమట్టం చేసిందన్నారు. దీంతో మూడో రోజు వచ్చేసరికి పాకిస్థాన్ మోకాళ్లపై నిలబడి.. `ఆపరేషన్ సిందూర్ వద్దు మహప్రభో!` అని వేడుకుందని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మనకు నచ్చజెప్పబోయా రని..కానీ, పాకిస్థాన్‌నువదిలేది లేదని ఆయనకు స్పష్టం చేశానని ప్రధాని మోడీ వివరించారు.
నాలుగు రోజులు గడిచేసరికి.. పాకిస్థాన్.. అడుక్కునే పరిస్థితికి వచ్చిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ``దాడులు ఆపాల ని.. మోకాళ్లపై కూర్చుని.. మనల్ని అడుక్కుంది. అయినా.. మనం క్షమించేది లేదని తెగేసి చెప్పాం. యుద్ధం చేయడం భారత్ లక్ష్యం కాదు. మన లక్ష్యం ఉగ్రవాదం. ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాం. మన లక్ష్యం పూర్తయ్యా కే.. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాం. దీనిలో ఏ దేశం ప్రమేయం కానీ.. ఏ నాయకుడి ప్రమేయం కానీ లేదు`` అని మోడీ వ్యాఖ్యానించారు. కానీ.. దేశంలో చిచ్చు పెట్టేలా.. పనికిమాలిన సందేహాలతో ప్రతిపక్షాలు దీనిని రాజకీయాలకు వినియోగించు కునే ప్రయత్నం చేశాయని ఆయన దుయ్యబట్టారు.
ఆపరేషన్ సిందూర్.. ఇంకా కొనసాగుతోందని ప్రధాని వెల్లడించారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన విధంగా ఆ దేశానికి బుద్ధి చెప్పేందుకు మన సేనలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటు వేదికగా మరోసారి చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని.. దానికి మద్దతుగా నిలిచే దేశాలను కూడా ఉపేక్షించేది లేదన్నారు. అమాయక పౌరులను చంపే హక్కు ఎవరికీ లేదన్న ప్రధాని.. ఈ ఘటనలను చూస్తూ కూర్చునేందుకు ఇక్కడ.. ఉదాశీన, బుజ్జగింపు( నెహ్రూ) ప్రభుత్వం లేదని నిప్పులు చెరిగారు.