విమానం ఇంజిన్ లో పడి వ్యక్తి మృతి... ఆత్మహత్యా?
ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్ లో బాధిత ప్రయాణీకులు, సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి, వారికి మానసిక సహాయాన్ని అందించడానికి తాము ప్రతిదీ చేస్తున్నామని తెలిపింది.
By: Tupaki Desk | 8 July 2025 10:34 PM ISTఇటీవల వరుసగా విమాన ప్రమాదాలకు సంబంధించిన, సాంకేతిక లోపాల కారణంగా రద్దవుతున్న విమానాలకు సంబంధించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా భద్రతా సిబ్బంది కళ్లు గప్పి నేరుగా విమానం పార్కింగ్ జోన్ కు వెళ్లిన ఓ వ్యక్తి.. విమానం ఇంజిన్ లో పడి మృతి చెందిన ఘటన తాజాగా జరిగింది.
అవును... భద్రతా సిబ్బంది కళ్లు గప్పిన ఓ వ్యక్తి విమానాశ్రయంలోని రన్ వేపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అక్కడున్న విమానం ఇంజిన్ లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో తాజాగా చోటు చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్యా ప్రయత్నమా.. లేక మరో కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువకుడు విమానాశ్రయ పరిసరాల్లోకి అనుమానాస్పదంగా ప్రవేశించాడు. తన వాహనాన్ని ఎయిర్ పోర్టు బయట ఉంచేసి, భద్రతా సిబ్బంది కళ్లు గప్పాడు! నేరుగా విమానం పార్కింగ్ జోన్ కు వెళ్లే ఎవర్జెన్సీ ద్వారాన్ని బలవంతంగా ఓపెన్ చేశాడు. అనంతరం రన్ వే వైపు పరుగు తీశాడు.
ఈ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్ బస్ సమీపంలోకి వెళ్లేసరికి.. ఇంజిన్ వేగానికి అందులో కూరుకుపోయయాడు. ప్రాణాలు కోల్పోయాడు. దీంతో... అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని, ఇంజిన్ ను ఆపేసి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో... కొన్ని గంటలపాటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అయితే.. ఇది ఆత్మహత్యా ప్రయత్నమా.. లేక, మరేదైనా కారణం ఉందా.. అసలు ఇంత కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని దాటుకుని ఎలా ప్రయత్నించాడు.. ఈ ప్రయత్నం వెనుక మరేదైనా లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఎయిర్ పోర్ట్ లో ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఈ ఘటనపై వోలోటియా స్పందించి. ఈ ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 154 మంది ప్రయాణికులు ఉన్నారని, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారని ధృవీకరించింది. ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్ లో బాధిత ప్రయాణీకులు, సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి, వారికి మానసిక సహాయాన్ని అందించడానికి తాము ప్రతిదీ చేస్తున్నామని తెలిపింది.