Begin typing your search above and press return to search.

మా కోళ్లు, మేకలను కాపాడండి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

శివపురి జిల్లాలోని కోలారస్ మాంసం మార్కెట్‌లో జరుగుతున్న వరుస దొంగతనాల కారణంగా వ్యాపారులు భయంతో వణికిపోతున్నారు.

By:  Tupaki Desk   |   30 April 2025 4:00 AM IST
మా కోళ్లు, మేకలను కాపాడండి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
X

మధ్యప్రదేశ్‌లోని ఒక పట్టణంలో చోటుచేసుకున్న విచిత్రమైన దొంగతనాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అక్కడ దొంగలు బంగారం, డబ్బు కోసం కాదు.. కోళ్లు, మేకల కోసం పడుతున్నారు. వరుస దొంగతనాలతో వ్యాపారులు భయంతో వణికిపోతూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోందో ఈ కథనంలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా, కోలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్‌పూర్ తిరాహాలో ఉన్న మాంసం మార్కెట్‌లోని వ్యాపారులు భయాందోళనలో ఉన్నారు. వారి భయానికి కారణం ఆ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలే. దొంగలు మాంసం దుకాణాల్లోని కోళ్లు, మేకలను ఎత్తుకెళ్తున్నారు. గత రెండు రోజుల్లోనే గుర్తు తెలియని దొంగలు ఈ దుకాణాల్లో చోరీలకు పాల్పడి ఇప్పటివరకు 30 కోళ్లు, 8 కంటే ఎక్కువ మేకలను అపహరించుకుపోయారు.

ఈ ప్రాంతంలోని మాంసం మార్కెట్‌లో సోమవారం మొదటి సంఘటన నమోదైంది. వీరు ఖటిక్ అనే మాంసం దుకాణదారుడి షాపు తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని దొంగలు 8 మేకలను ఎత్తుకెళ్లారు. అంతకుముందు ఆదివారం కూడా ఇదే మాంసం మార్కెట్‌లో మరో సంఘటన జరిగింది. గుర్తు తెలియని దొంగలు ఆషిక్ ఖాన్ దుకాణంలోకి చొరబడి అందులో ఉన్న 30 కోళ్లను దొంగిలించారు. ఈ వరుస దొంగతనాలతో వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

శివపురి జిల్లాలోని కోలారస్ మాంసం మార్కెట్‌లో జరుగుతున్న వరుస దొంగతనాల కారణంగా వ్యాపారులు భయంతో వణికిపోతున్నారు. తమ దుకాణాలకు భద్రత కల్పించాలని వారు పోలీసులను కోరారు. స్థానిక కోలారస్ పోలీసులు వ్యాపారుల అభ్యర్థన మేరకు మాంసం మార్కెట్ పరిసరాల్లో రాత్రిపూట పోలీసు గస్తీని పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఫిర్యాదు స్వీకరించిన తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని కూడా తెలిపారు.

ఈ వ్యవహారంపై కోలారస్ పోలీసులు మాట్లాడుతూ.. మాంసం మార్కెట్‌లో జరిగిన దొంగతనాలపై ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ రోజు నుండి ఆ ప్రాంతంలో రాత్రిపూట గస్తీ పెంచుతామని వారు చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నది ఎవరనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు.