Begin typing your search above and press return to search.

హరీశ్ రావు ఇంటికి కేటీఆర్.. ఏం జరుగుతోంది?

సుమారు రెండు గంటల పాటు ఏకాంతంగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   16 May 2025 3:04 PM IST
హరీశ్ రావు ఇంటికి కేటీఆర్.. ఏం జరుగుతోంది?
X

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు రెండు గంటల పాటు ఏకాంతంగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయని, హరీశ్ రావు పార్టీ మారే యోచనలో ఉన్నారని ప్రత్యర్థి పార్టీల నుండి ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా హరీశ్ రావు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ పార్టీలో అంతర్గత సఖ్యతను చాటిచెప్పే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపైనే చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా, ఇటీవల హరీశ్ రావు తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. కేసీఆరే తన నాయకుడని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అలాగే, కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావుల భేటీ పార్టీలో నెలకొన్న అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ భేటీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇరువురు కీలక నేతల కలయిక బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని అంచనా వేస్తున్నారు.