నీళ్లు బాబుకు.. నిధులు ఢిల్లీకి.. నియామకాలు తొత్తులకు..కేటీఆర్ ఫైర్
రైతు సంక్షేమంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుని విమర్శలతో నిప్పులు చెరిగారు.
By: Tupaki Desk | 8 July 2025 9:00 PM ISTరైతు సంక్షేమంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుని విమర్శలతో నిప్పులు చెరిగారు. రైతులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో ఎవరు ఎంత సంక్షేమం చేశారో చర్చ కోసం మంగళవారం ప్రెస్ క్లబ్ కు రావాలంటూ రేవంత్ ను కోరితే ఆయన ఢిల్లీకి పోయారని ఎద్దేవా చేశారు. ప్రెస్ క్లబ్, దానికిముందు పార్టీ కార్యాలయం బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రికత్తలు నెలకొనే ప్రమాదం ఉండడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
ప్రెక్ క్లబ్ కు చేరుకున్నాక.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది రైతుల ఆత్మశాంతికి బీఆర్ఎస్ నేతలు మౌనం పాటించారు. ఏడాదిన్నరగా సాగుతున్న అరాచక పాలనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నోటికి వచ్చినట్లుగా 420 హామీలు, వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అంటూ డైలాగులు కొట్టి ఏడాదిన్నరగా 70 లక్షల మంది రైతులు, కోట్లాది కుటుంబాలను దగా చేసిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో బాండ్ పేపర్ రాసిచ్చి గెలిచాక ఒక్క హామీని కూడా నెరవేర్చని రేవంత్.. లేస్తే అరుపులు, కేవలు, బూతులు మాట్లాడతారని విమర్శించారు.
రేవంత్ పాలనలో నీళ్లు ఆయన గురువు చంద్రబాబుకు, నిధులు కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్న ఢిల్లీకి, నియామకాలు ఆయన తొత్తులకు దక్కాయని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ రైతాంగం, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందామని తాను రేవంత్ కు సవాల్ విసిరానని.. బేసిక్ నాలెడ్జ్ లేని సీఎంకు 72 గంటల సమయం ఇచ్చానని, ఎక్కడకు అంటే అక్కడకు వస్తానని చెప్పానని తెలిపారు.
రేవంత్ కు రచ్చ చేయడమే వచ్చని.. చర్చ చేయడం రాదని తేలిందని కేటీఆర్ అన్నారు. సీఎం రాలేకపోతే.. డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి గానీ, ఇతర మంత్రులను కానీ పంపుతారని భావించామని.. కానీ ,ఆయన ఢిల్లీకి పోయిండని చెప్పారు.
రేవంత్ కు బూతులు మాట్లాడడం వస్తుందని.. రైతుల గురించి మాట్లాడడం రాదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల పైనా రేవంత్ కు బేసిక్ నాలెడ్జి లేదని.. ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉన్నదో సాగునీటి అధికారులను చిన్న పిల్లాడు అడిగినట్లు అడుగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇతడా? మనకు న్యాయం చేసేందని రైతులు బాధపడుతున్నట్లు తెలిపారు.
రేవంత్.. చంద్రబాబుకు కృష్ణా గోదావరి నీళ్లను పంపిస్తున్నాడని, గోదావరిలో బనకచర్ల కడుతుంటే పచ్చజెండా ఊపుతున్నాడని.. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగచాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకుని చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసి రేవంత్ పదవి కాపాడుకుంటున్నాడని.. అందుకే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి పేసీఎం అని పేరు పెట్టారని పేర్కొన్నారు.
రైతు భరోసాలోని డొల్లతనాన్ని చెబుదామని అధికారిక సమాచారంతో వచ్చానని.. సీఎం నియోజకవర్గం కొడంగల్ లో రైతు భరోసా రాని 670 మంది రైతుల పేర్లు, అడ్రస్సులు, ఫోన్ నెంబర్లు తీసుకొని ప్రెస్ క్లబ్ కు వచ్చానని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రుణమాఫీ కానీ లక్షల మంది వివరాలతో జాబితా తీసుకొచ్చానన్నారు.
బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక పంటను మిల్లర్లకు అమ్ముకుని నష్టపోయిన రైతుల జాబితా తీసుకుని వచ్చాని కేటీఆర్ చెప్పారు.
సీఎం చాలా బిజీగా ఉంటారని.. ఆయనకు మరో అవకాశం ఇస్తున్నామని, ప్లేస్, టైమ్, డేట్ డిసైడ్ చేయాలని, జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు రమ్మన్నా వస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.