అరెస్టుకు ప్రసన్న సిద్ధం.. కాకాణికి తోడుగా ఉంటానని ప్రకటన
నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
By: Tupaki Desk | 8 July 2025 11:00 PM ISTనెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కోవూరులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేసుకుని ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిరసనగా టీడీపీ కార్యకర్తలు ప్రసన్న ఇంటిపైకి దాడికి తెగబడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రసన్న ఇంటిపై దాడి చేసిన కారణంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని అరెస్టు చేయాలని, దాడికి నైతిక బాధ్యత వహిస్తూ వారు పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రకటించడం మరింత వేడి పుట్టిస్తోంది.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోవూరులో టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరులో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే టీడీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పెద్దగా లెక్కచేయని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తాను సోమవారం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తెగేసి చెప్పారు. అంతేకాకుండా తనను అరెస్టు చేస్తే జైల్లోనే ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటానని తేల్చిచెప్పారు.
‘ప్రశాంతి రెడ్డి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా, మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్టు చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా’ అంటూ ప్రసన్న స్పష్టం చేశారు. దీంతో నెల్లూరు వేదికగా అధికార, విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు వరకు అంతా ఒకే పార్టీలో ఉండగా, ఎన్నికల సమయంలో వేమిరెడ్డి దంపతులు పార్టీ మారడం, ప్రసన్నపై ప్రశాంతి రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. నాటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, ప్రసన్న తాజా వ్యాఖ్యలతో వివాదం ముదిరిపోయింది.
ఇక ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రసన్న తీవ్ర విమర్శలు ఎదుర్కుంటుండగా, ఆ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని ఆయన ప్రకటించడంతో తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు భావిస్తున్నారు. తన ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డి అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తనపై వ్యాఖ్యలను నిరసించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాజీ ఎమ్మెల్యేపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇకపై ఈ వ్యవహారం ఎటుదారితీస్తుందనే విషయమై చర్చ జరుగుతోంది.