డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్ వెనుక ఏం జరిగిందంటే?
ఎరక్కపోయి ఇరుక్కోవడం అంటే ఇదే.. ఏదో చిన్న గొడవ జరిగిన ఘటనలో తీగలాగితే డొంక కదిలింది.
By: Tupaki Desk | 24 Jun 2025 1:01 PM ISTఎరక్కపోయి ఇరుక్కోవడం అంటే ఇదే.. ఏదో చిన్న గొడవ జరిగిన ఘటనలో తీగలాగితే డొంక కదిలింది. ఏకంగా ఓ హీరో మెడకు ఉచ్చు బిగిసింది. గొడవ కాస్త డ్రగ్స్ కేసుగా మారి ఓ హీరోను బుక్ చేసింది. తమిళ సినీ నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్టుతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ అరెస్టుతో మొదలైన ఈ డ్రగ్స్ వ్యవహారం, చివరికి శ్రీరామ్ అరెస్టుకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నై నగరంలో ఇటీవల జరిగిన ఓ సంచలన ఘటన తమిళ సినీ పరిశ్రమను కుదిపేసింది. ప్రముఖ తమిళ హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్టు వెనుక జరిగిన పరిణామాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
-అసలేం జరిగింది?
చెన్నైలోని ఓ ప్రముఖ బార్‌లో ఇటీవల జరిగిన ఘర్షణలో అన్నాడీఎంకే నేత ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్‌పై డ్రగ్స్ వినియోగం ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి అమ్మారు అనే కోణంలో ఆరా తీయగా, ఈ విచారణలో నటుడు శ్రీరామ్ పేరు బయటపడింది.
ప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు, శ్రీరామ్ గతంలో 40 సార్లు పైగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, తగిన ఆధారాలు సేకరించిన తర్వాత నిన్న శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు.
-కొకైన్ స్వాధీనం, రిమాండ్
అన్నాడీఎంకే పార్టీ మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా, వారే శ్రీరామ్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అంగీకరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి లోతుగా విచారించారు. విచారణ అనంతరం శ్రీరామ్‌ను చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం శ్రీరామ్‌కు జులై 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.
-పోలీసుల తదుపరి చర్యలు
ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు నుంగంబాక్కం పోలీసులు శ్రీరామ్‌ను కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. శ్రీరామ్‌ను విచారిస్తే డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోలీవుడ్‌కు చెందిన మరికొందరు నటీనటుల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఈ అరెస్ట్‌తో తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌లో మరికొందరు ప్రముఖుల సంబంధాలు ఉన్నాయా అన్నదానిపై కూడా విచారణ సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశముందని పోలీసులు వెల్లడించారు.