18 అడుగుల పొడవు.. 20 కేజీల బరువున్న కింగ్ కోబ్రాను పట్టేసిన లేడీ ఆఫీసర్
కేరళ అటవీ శాఖకు చెందిన మహిళా అధికారిణి సాహసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 18 అడుగుల పొడవు.. 20 కేజీలకు పైనే బరువున్న అత్యంత విషపూరిత కింగ్ కోబ్రాను ఒడుపుగా పట్టేసిన వైనం అందరిని ఆకర్షిస్తోంది.
By: Tupaki Desk | 8 July 2025 9:00 AM ISTకేరళ అటవీ శాఖకు చెందిన మహిళా అధికారిణి సాహసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 18 అడుగుల పొడవు.. 20 కేజీలకు పైనే బరువున్న అత్యంత విషపూరిత కింగ్ కోబ్రాను ఒడుపుగా పట్టేసిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. విషపూరిత కింగ్ కోబ్రా ఉందన్న సమాచారం అందుకున్నఆమె.. అత్యంత సాహసాన్ని ప్రదర్శించారు. కింగ్ కోబ్రాను ఆమె బంధించే వేళలో ఆమె చుట్టుపక్కల చాలా మంది ఉన్నా.. దగ్గరకు వచ్చి ఆమెకు సాయంగా నిలిచిన వారే లేకపోవటం గమనార్హం.
ఆమె కింగ్ కోబ్రాను బంధించిన వైనాన్ని పలువురు వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లోనూ.. మీడియాలోనూ ఈ వీడియో వైరల్ గా మారింది. పరుథిపల్లీ రేంజ్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నరోహిణి అనే మహిళా అధికారిణి పెప్పరా అభయారణ్యంలోని ఒక కాలువలో 18 అడుగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రాను ఒడుపుగా బంధించారు. అటవీ శాఖ అధికారిణిగా వ్యవహరిస్తున్న గడిచిన ఎనిమిదేళ్లలో 500లకు పైగా పాముల్ని పట్టుకున్న ఘన చరిత్ర ఆమె సొంతంగా చెబుతున్నారు.
తాజాగా కింగ్ కోబ్రాను బంధించిన సమయంలో తీసిన వీడియో వైరల్ అయిన వేళ.. ఆమె సాహసాన్ని పలువురు అభినందిస్తే.. ఆమె పట్టుకున్న తీరుపై కొందరు విలువైన సలహాలు.. సూచనలు ఇస్తూ హెచ్చరించటం గమనార్హం. బల్లులు.. బొద్దింకల్ని సైతం చూసి హడలిపోయే మహిళలకు రోషిణి ప్రదర్శించిన ధైర్యసాహసాలను మిగిలిన మహిళలు స్ఫూర్తి పొందాలని వ్యాఖ్యానిస్తే.. మరొకరు ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. బ్యాగులోకి బంధించటానికి రోషిణి ప్రయత్నిస్తుంటే.. ఆమె చుట్టూ ఉన్న వారెవరూ ఆమెకు సాయం చేయటానికి సైతం ముందు రాలేదని గ్యాలరీలో కూర్చొని రన్నింగ్ కామెంటరీకే పరిమితమయ్యారన్నారు.
కింగ్ కోబ్రాను పట్టుకున్న తీరులో ఆమెకు అంత అనుభవం లేదని.. నైపుణ్యం తక్కువే అన్న వ్యాఖ్యల్ని కొందరు చేశారు. ఇందుకు.. ఆమె కింగ్ కోబ్రాను పట్టుకునే వేళలో.. ఇనుప సువ్వను జారివేయటాన్ని ప్రస్తావించారు. ఇలాంటి ప్రమాదకర పనులు చేసే వేళ.. మరింత అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనే చేశారు. రోషిణి చేతుల్లో నుంచి ఇనుప చువ్వ జారి కింద పడినా.. ఆమెలో ఆత్మవిశ్వాసం పోలేదు సరి కదా.. దాన్ని పట్టుకున్న తీరు అభినందనీయంగా పేర్కొంటున్నారు.
అయితే.. విషపూరిత పాముల్ని పట్టుకునే వేళలో అటవీ శాఖ అధికారులు వ్యక్తిగత రక్షణ పరికరాల్ని ఉపయోగించకపోవటాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. రోషిణి ప్రయత్నాన్ని విమర్శించటం లేదు కానీ.. అలాంటి వారికి తగిన పనిముట్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏమైనా.. ఒక దశలో కింగ్ కోబ్రా తోకను ఒడుపుగా పట్టుకొని.. సంచిలో వేసిన వైనాన్ని మాత్రం అందరూ అభినందిస్తున్నారు.