Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రసంగంలో మిస్సైన రేవంత్ పేరు.. ఏంటి కథ?

ఈ ప్రసంగంలో అత్యంత ఆసక్తికరంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం.

By:  Tupaki Desk   |   28 April 2025 11:33 AM IST
కేసీఆర్ ప్రసంగంలో మిస్సైన రేవంత్ పేరు.. ఏంటి కథ?
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన సీఎం అవ్వడానికి ప్రధాన కారణం కేసీఆర్ నే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటులో జైలుకు పంపి ఆయనను రాజకీయంగా ఎదిగేందుకు కేసీఆర్ నే కారణమన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. రేవంత్ సైతం ఇదే మాట తరుచూ అంటున్నారు. సాధారణ ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కేసీఆర్ ఆయన ఇమేజ్ ను పెంచారని అంటున్నారు. ఆ కసి, పగతోనే రేవంత్ రెడ్డి బలంగా ఎదిగి కేసీఆర్ కు బద్ధ శత్రువులా మరి ఏకంగా రాజకీయ అధికారం సంపాదించారు. తన ప్రతీ మాటలో కేసీఆర్ పై విమర్శలను రేవంత్ ప్రస్తావిస్తుంటారు. అయితే రేవంత్ రెడ్డిని సీఎం కావడంలో పరోక్షంగా కారణమైన కేసీఆర్ నోట మాత్రం రేవంత్ రెడ్డి పేరు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసెంబ్లీలో, నిన్నటి సభలోనూ కేసీఆర్ నోట అసలు రేవంత్ పేరు రాకపోవడం గమనార్హం. రేవంత్ ను కావాలనే కేసీఆర్ ఇగ్నోర్ చేస్తున్నాడా? ఎందుకు రేవంత్ ను ప్రస్తావించడం లేదన్నది చర్చనీయాంశమైంది.

వరంగల్‌లో నిన్న రాత్రి జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ 25 వసంతాల మెగా బహిరంగ సభ తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా హాజరైన ఈ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సభ ద్వారా కేసీఆర్ తమ బలాన్ని ప్రదర్శించాలనుకున్నారు, అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ప్రసంగం సాగింది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మండుతున్న అనేక అంశాలను కేసీఆర్ తన ప్రసంగంలో స్పృశించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం తనకు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కూల్చేంత బలం బీఆర్ఎస్‌కు లేని నేపథ్యంలో ఇది కేవలం శక్తి ప్రదర్శనలో భాగంగానే కనిపించింది.

దాదాపు గంటపాటు సాగిన కేసీఆర్ ప్రసంగం, ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ ప్రసంగంలో అత్యంత ఆసక్తికరంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం.

కాంగ్రెస్ ప్రభుత్వంపై, వారి విధ్వంసకర రాజకీయాలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కానీ, గంటపాటు సాగిన తన సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును ఆయన నోట పలకలేదు. గత దాదాపు ఏడాదిన్నర కాలంగా తెలంగాణ అసెంబ్లీలోనూ రేవంత్ రెడ్డిని నేరుగా ఎదుర్కోవడానికి కేసీఆర్ ఇష్టపడటం లేదని, వ్యూహాత్మకంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు వరంగల్ సభలో కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా జాగ్రత్తపడటం చూస్తుంటే, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఏదో ఒక బలమైన అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. కేసీఆర్ వ్యూహం వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా విమర్శించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేసీఆర్ ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారు అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.