Begin typing your search above and press return to search.

రోటీన్ కు భిన్నంగా స్క్రిప్టు మార్చాల్సింది కేసీఆర్

పార్టీ పెట్టిన పాతికేళ్ల సంబరాన్ని అంబరాన్ని తాకేలా ప్లాన్ చేసినట్లుగా భారీ ఎత్తున ప్రచారం బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారిందా? అంటే అవునని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   29 April 2025 10:24 AM IST
రోటీన్ కు భిన్నంగా స్క్రిప్టు మార్చాల్సింది కేసీఆర్
X

పార్టీ పెట్టిన పాతికేళ్ల సంబరాన్ని అంబరాన్ని తాకేలా ప్లాన్ చేసినట్లుగా భారీ ఎత్తున ప్రచారం బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారిందా? అంటే అవునని చెబుతున్నారు. గులాబీ పార్టీ ఘన చరిత్రను చూస్తే.. ఆ పార్టీకి ఉప ఎన్నికలు.. భారీ బహిరంగ సభలే ప్రాణవాయవులు. రాజకీయాల్ని ప్రభావితం చేయటమే కాదు.. రాజకీయ ఎజెండాను సెట్ చేసేలా కేసీఆర్ ప్లానింగ్ ఉండేది. పాతికేళ్ల గులాబీ పార్టీ ప్రస్థానాన్ని చూస్తే.. ఇలాంటివి బోలెడన్ని కనిపిస్తాయి. మరి.. అంత అనుభవం ఉన్న గులాబీ బాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రజతోత్సవ సభ.. అంచనాలకు తగ్గట్లు లేదన్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఎందుకిలా? అంటే.. పాత స్క్రిప్టునే.. తాజా సభలోనే వల్లెవేయటం. అదే పనిగా చెప్పే పాత ముచ్చట్లు ముఖం మొత్తిన పరిస్థితి. ఈ విషయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ గుర్తించినట్లుగా కనిపించట్లేదు. తెలంగాణ సాధనను అందరి నుంచి లాక్కొని తన ఒక్కడి టాలెంట్ అని చెప్పే కేసీఆర్ మాటలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను ఎవరూ తక్కువ చేసి చూపలేనిది. అదే సమయంలో.. మొత్తం క్రెడిట్ ను ఆయనకే సొంతం చేయటాన్ని తెలంగాణవాదులు ఒప్పుకోని పరిస్థితి.

నిజానికి ఏ రాజకీయ అధినేత అయినా.. తన గొప్పను తాను చెప్పుకునే కంటే.. ప్రజలు తన గొప్పతనాన్ని కీర్తించేలా ఉండాలి. ఈ లాజిక్ ను కేసీఆర్ మిస్ అవుతున్నట్లుగా చెప్పాలి. ఎంతసేపటికి తాను ఎంత గొప్పవాడినన్న విషయాన్ని చెప్పుకోవటానికే సమయాన్ని వెచ్చించటం.. తన మంచితనం గురించి.. తన పాలన గురించి గొప్పలు చెప్పుకోవటం శాపంగా మారుతోంది. ఎందుకంటే.. కేసీఆర్ ప్రస్తావించే ప్రతి మాటకు.. కౌంటర్ మనసులో మెదిలే దుస్థితి. పదేళ్ల పాలనలో ఆయన వ్యవహరించిన తీరు.. పలు సందర్భాల్లో స్పందించిన వైనాలు ఇప్పటికి ఎవరూ మర్చిపోయింది లేదు. అలాంటప్పుడు గొప్పలు చెప్పుకోవటం ఎవరికి మాత్రం ఆమోదంగా ఉంటుంది?

ఉదాహరణకు కొండా లక్ష్మణ్ బాపూజీ అంశాన్నే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టిన కేసీఆర్ కు పార్టీ ఆఫీసుకు అవసరమైన స్థలం లేని దుస్థితి. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కల కనే కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద మనసుతో జల ద్రశ్యాన్ని కేసీఆర్ కు అప్పజెప్పారు. కాలక్రమంలో ఎదిగిన గులాబీ పార్టీ చేతికి అధికారం దఖలు పడటం తెలిసిందే. మరి.. తనకు నీడను ఇచ్చి.. తాను ఎదిగేందుకు కీలకంగామారిన కొండా లక్ష్మణ్ బాపూజీకి కేసీఆర్ ఏం చేశారు?

తన కలల సౌదం తెలంగాణ సచివాలయానికి అయినా ఆయన పేరు పెట్టి ఉండాల్సింది కదా? ఆ మాటకు వస్తే.. కేసీఆర్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన దానికి ఒక శాతం కూడా ఆయనకు తిరిగి చేయలేదన్న విమర్శ బలంగా వినిపిస్తూ ఉంటుంది. చివరకు ఆయన మరణించిన వేళలో కేసీఆర్ సర్కారు ఆయన విషయంలో సముచితంగా వ్యవహరించిందా? అంటే లేదని చెబుతారు ఉద్యమకారులు.

కట్ చేస్తే.. అధికారం చేజారి కాంగ్రెస్ చేతిలో పవర్ ఉన్న వేళ.. పార్టీ రజతోత్సవ సభను నిర్వహించే వేళలో కేటీఆర్.. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ప్రస్తావించి.. ఆయనకు నివాళులు అర్పించటం చూసిన చాలామంది గతాన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి. ఆ వెంటనే.. కొండా లక్ష్మణ్ బాపూజీ విషయంలో కేసీఆర్ చేసిన విషయాల్ని గుర్తుకు తెచ్చుకునే వారికి సమయానికి తగినట్లు మాట్లాడే ఆయన పార్టీ తీరు గుర్తుకు వచ్చి.. అప్పటివరకు ఉన్న కొద్దిపాటి సానుకూలత కూడా మాయమయ్యే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇలాంటి చేష్టలు పార్టీకి శాపంగా మారాయి. అందుకే.. తన పాత స్క్రిప్టును పక్కన పెట్టేసి.. సరికొత్త స్క్రిప్టుతో ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అందుకు కేసీఆర్ ఎప్పటికి సిద్ధమవుతారు?