అమితాబ్ షోలో 'ఆపరేషన్ సింధూర్' నాయికలు.. స్ట్రీమింగ్ అప్పుడే?
ఈ విధంగా ఈ ముగ్గురు రియల్ రాణి రుద్రమదేవిలు ఆపరేషన్ సింధూర్ గురించి అద్భుతంగా వర్ణించినట్టు ఈ ప్రోమోలో చూపించారు.
By: Madhu Reddy | 13 Aug 2025 3:50 PM ISTబాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ క్రేజ్ కు తగ్గట్టే ఆయన చేసే షో 'కౌన్ బనేగా కరోడ్ పతి'. అయితే ఈ షో 17వ సీజన్ కోసం చాలామంది స్పెషల్ గెస్ట్ లను పిలిచారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. అయితే ఈ సందర్భంగా దేశం కోసం పోరాడి, గెలిచిన నిజమైన హీరోలను మనకు చూపించబోతున్నారు. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే..ఆడ పులులు.. "ఆపరేషన్ సింధూర్" తో అద్భుతాలు సృష్టించిన ముగ్గురు మహిళ అధికారులు.. వీరిలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోషియో ఖురేషి, కమాండర్ ప్రేరణ డియోస్తలి రాబోతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ షోలో వారు పాల్గొంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఈ ముగ్గురు అధికారులు ఆపరేషన్ సింధూర్ లో ఎదుర్కొన్న ఆసక్తికర విషయాల గురించి తెలియజేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ గురించి కల్నల్ ఖురేషి మాట్లాడుతూ.. "ఆపరేషన్ సింధూర్ అనేది తప్పనిసరి చర్య అన్నారు". ఆ సమయంలో అది ఎందుకు అవసరమో కూడా తెలియజేశారు. వ్యోమికా సింగ్ , ప్రేరణ కూడా ఇదే విషయాన్ని బయట పెట్టారు. పాకిస్తాన్ ఈ విధంగా పదే పదే భారతదేశాన్ని ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ వంటి యుద్ధం తప్పనిసరి అయిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రామ్ అనేది కేవలం 25 నిమిషాల్లో పూర్తయిందని వ్యోమికా సింగ్ తెలియజేశారు. ఈ టైంలోనే అనుకున్న లక్ష్యాలను ఛేదించామని కమాండర్ ప్రేరణ డియోస్తలి అన్నారు.
ఈ విధంగా ఈ ముగ్గురు రియల్ రాణి రుద్రమదేవిలు ఆపరేషన్ సింధూర్ గురించి అద్భుతంగా వర్ణించినట్టు ఈ ప్రోమోలో చూపించారు. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో పూర్తి షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని ప్రోమో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఫుల్ ఎపిసోడ్ వస్తోంది. అయితే విడుదలైన ప్రోమో పై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి.
ఎందుకంటే ప్రోటోకాల్ ని ఈ ముగ్గురు అధికారులు ఉల్లంఘించారని అంటున్నారు. అంతేకాదు ఇప్పటివరకు చాలా దేశాల్లో చాలా యుద్ధాలు జరిగాయి. కానీ ఇలా ఏ సైనిక అధికారి కూడా యూనిఫాం ధరించి ఎంటర్టైన్మెంట్ షోలకు వెళ్లలేదు. మొదటిసారి వీళ్లు ఈ దేశంలో షో కి యూనిఫాం వేసుకొని వచ్చారు.. భారతదేశ సాయుధ దళాలకు ఎంతో గౌరవం ఉంది. అలాంటి గౌరవ మర్యాదల్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి అంటూ ఈ అధికారులు చేసిన పనిపై మండి పడుతున్నారు. యూనిఫామ్ వేసుకుని ఎంటర్టైన్మెంట్ షోకి ఎలా వస్తారంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రశ్నిస్తున్నారు.