కాకాణి అరెస్టు తప్పదా? మాజీ మంత్రి ముందున్నఆప్షన్లు ఏంటి?
ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో కాకాణి అరెస్టు నుంచి తప్పించుకోలేరని అంటున్నారు.
By: Tupaki Desk | 16 May 2025 5:12 PM ISTమాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అరెస్టు ముప్పు మరింత ఎక్కువైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో కాకాణి అరెస్టు నుంచి తప్పించుకోలేరని అంటున్నారు. క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలు, అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వాడకం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను కాకాణి ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసుస్టేషనులో ఈ కేసులు నమోదు చేయగానే దమ్ముంటే తనను అరెస్టు చేయమని సవాల్ విసిరిన కాకాణి, పోలీసులు విచారణకు పిలవడంతోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడా ఆయనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో ఇక నేడో, రేపో అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
నెల్లూరు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగుసార్లు గెలిచిన కాకాణి గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. అదేసమయంలో రాష్ట్రంలో కూడా టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో కాకాణికి కష్టాలు మొదలయ్యాయి. ఆయన మంత్రిగా ఉండగా, చోటుచేసుకున్న పరిణామాలపై ఫోకస్ చేసిన టీడీపీ నేతలు అక్రమ మైనింగుపై కేసులు పెట్టారు. ఇదే సమయంలో మైనింగు అడ్డుకుంటున్న గిరిజనులను బెదిరించారని మరో కేసు నమోదు చేయించారని చెబుతున్నారు. దీంతో కాకాణి అరెస్టు నుంచి రక్షణ నిమిత్తం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల తీర్పు రావడంతో ఆయన భవిష్యత్తుపై ఉత్కంఠ ఎక్కువవుతోంది.
పొదలకూరు పోలీసుస్టేషనులో కేసు నమోదు చేసిన తర్వాత, ఆ కేసును తేలిగ్గా తీసుకున్న కాకాణి సుమారు 40 రోజులపాటు స్వేచ్ఛగా తిరిగారు. పోలీసులు తనకు వ్యతిరేకంగా ఆధారాలు చూపలేరని, తనపై నమోదైన కేసుతో ఏం సాధించలేరని భావించారు. దీంతో దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారని పరిశీలకులు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అనూహ్యంగా అక్రమ మైనింగుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంతో కాకాణికి ఇబ్బంది తలెత్తిందని అంటున్నారు.
ఎప్పుడైతే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి అరెస్టు తప్పదనే సంకేతాలు ఇవ్వడంతో కాకాణి ఆకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. కేసు విచారణకు రమ్మంటూ ఆయనకు రెండుమూడు నోటీసులిచ్చినా కాకాణి లెక్కచేయలేదు. న్యాయపోరాటం ద్వారా బెయిల్ తెచ్చుకోవాలని భావించారు. అయితే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఏదైనా కోర్టులో లొంగిపోయి బెయిల్ తెచ్చుకోవడమే ఆయన ముందున్న ఏకైక మార్గమని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. గత మూడు నెలలుగా అండర్ గ్రౌండులోనే ఉన్న కాకాణి ప్రస్తుత పరిస్థితుల్లో అరెస్టు నుంచి తప్పించుకోలేరని అంటున్నారు. మరోవైపు సుప్రీం తీర్పు తర్వాత కాకాణి కోసం పోలీసు వేట మొదలైంది. గతంలోనే ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు సిబ్బంది మూడు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు.
నెల్లూరుతోపాటు హైదరాబాదులో కాకాణి నివాసాలు, కార్యాలయాల్లో గతంలో తనిఖీలు చేసిన పోలీసులు చెన్నై, బెంగళూరుకు కూడా వెళ్లారని అంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఆయన ఆచూకీ లేకపోవడంతో కాకాణి అనుచరుల కదలికలపైనా నిఘా వేశారని అంటున్నారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగులో ఉండటంతో కాకాణి సమాచారం పోలీసులకు తెలిసినా, చర్యలకు ఉపక్రమించలేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కోర్టు తీర్పు వెలువడటంతో కాకాణిని అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు.