'నన్ను కంట్రోల్ చేయెద్దు'... జయాబచ్చన్ కు అంత కోపం ఎందుకంటే..!
ఆపరేషన్ సిందూర్ పై నిన్నటివరకూ లోక్ సభలో వాడీవేడి చర్చ జరగ్గా.. బుధవారం రాజ్యసభలోనూ అదే స్థాయిలో చర్చ జరిగింది.
By: Raja Ch | 30 July 2025 8:49 PM ISTఆపరేషన్ సిందూర్ పై నిన్నటివరకూ లోక్ సభలో వాడీవేడి చర్చ జరగ్గా.. బుధవారం రాజ్యసభలోనూ అదే స్థాయిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, వెటరన్ నటి జయాబచ్చన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా పెద్దల సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారగా.. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి!
అవును... ఆపరేషన్ సిందూర్ పై రాజ్యసభలో చర్చ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ ఆపరేషన్ కు "సిందూర్" అనే పేరు పెట్టడాన్ని తప్పుబడుతూ, అధికార పార్టీని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎంపీలు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
ఆపరేషన్ సిందూర్ పై పెద్దల సభలో జరుగుతున్న చర్చలో జయాబచ్చన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆపరేషన్ కు ‘సిందూర్’ అని పేరుపెట్టడంపై మండిపడ్డారు.
ఇందులో భాగంగా.. ఈ ఘటనలో పలువురు మహిళలు భర్తలను కోల్పోయి, నుదుట సిందూరానికి దూరమయ్యారని.. అలాంటప్పుడు ఆ ఆపరేషన్ కు 'సిందూర్' అనే పేరు పెట్టడంలో ఔచిత్యం ఏమిటని జయాబచ్చన్ ప్రశ్నించారు. ఈ సమయంలో... అధికార పార్టీ ఎంపీలు కొందరు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడంతో జయాబచ్చన్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.
ఈ సందర్భంగా... 'మీరైనా మాట్లాడండి.. లేదా, నేనైనా మాట్లాడతా.. మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డుకోలేదు. మహిళలు సభలో మాట్లాడినప్పుడు కూడా నేను ఎప్పుడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు" అని అన్నారు. ఈ సమయంలో... పక్కనే కూర్చొన్న శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది జయాబచ్చన్ ను ఒక దశలో శాంతపరిచే ప్రయత్నం చేసినట్లు కనిపించారు.
దీంతో... జయాబచ్చన్ ఆమె వైపు చూస్తూ 'ప్రియాంకా.. నన్ను కంట్రోల్ చేయెద్దు' అని అన్నారు. అనంతరం... పహల్గాం ఉగ్రదాడి జరగడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని చెప్పిన జయాబచ్చన్... మీరు ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వ పెద్దలు నాశనం చేశారని.. బాధిత కుటుంబాల వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు.