జమిలి వస్తే విపక్షానికి ప్లస్సా మైనస్సా ?
జమిలి ఎన్నికలు వస్తే కేంద్రంలోని అధికార కూటమి నెత్తిన పాలు పోసినట్లేనా లేక విపక్ష ఇండియా కూటమికి లక్ చిక్కినట్లా అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 8 July 2025 3:00 PM ISTజమిలి ఎన్నికలు వస్తే కేంద్రంలోని అధికార కూటమి నెత్తిన పాలు పోసినట్లేనా లేక విపక్ష ఇండియా కూటమికి లక్ చిక్కినట్లా అన్న చర్చ సాగుతోంది. కేంద్రంలో మోడీ నాయకత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం తొందర పడుతోంది. జమిలి ఎన్నికలతో మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తోంది ఆదమరపు గా ఉన్న సమయం చూసి ప్రతిపక్షాలకు చెక్ చెప్పాలని వ్యూహ రచన చేస్తోంది.
ఈ దెబ్బతో ఒక ఏడాది వదిలేసుకున్నా మరో అయిదేళ్ల పాటు అధికారం తమ సొంతం అవుతుందని కూడా లెక్కలేసుకుంటోంది. ఈ రోజుకు చూస్తే దేశంలో ఎన్డీయేకు అనుకూల వాతావరణం ఉంది. అయితే ఈ వాతావరణం ఎన్నాళ్ళు అంటే విపక్షానికి చేయీ కాలూ కూడదీసుకోనంతవరకే. ఇప్పటిదాకా ఆ పని మీదనే ఇండియా కూటమి ఉంది. కూటమి పెద్దన్న కాంగ్రెస్ అయితే ఏదో ఒక అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేస్తే బొమ్మ బొరుసు అవుతుందని రాజకీయం పూర్తిగా చేంజి అవుతుందని భావిస్తోంది.
అసలు వారికి ఆ రకమైన చాన్స్ నే ఇవ్వరాదు అన్నదే కేంద్రంలోని మోడీ షాల పట్టుదల అందుకే ఒక వైపు జనాభా లెక్కలు, మరో వైపు కుల గణన చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. అలా ఈ రెండు లెక్కలూ కూడా 2027 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం వద్దకు వస్తాయి. దాంతో దేశంలో కొత్తగా ఎంపీ సీట్ల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుంది. ఆ విధంగా చూస్తే దేశంలో ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాదిన భారీగా సీట్లు పెరుగుదల ఉంటుంది.
అవి యూపీ బీహార్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి చోట్ల అత్యధికంగా ఉండే సీన్ కనిపిస్తోంది. దక్షిణాదిన పెద్దగా పెరిగేది ఏమీ ఉండదు, ఇంకో వైపు ఎన్డీయే కూటమి చేతిలో పాశుపతాస్త్రం మాదిరిగా మహిళా బిల్లు ఉంది. దాంతో దేశంలో మహిళలకు మూడవ వంతు సీట్లు రిజర్వ్ అవుతాయి. ప్రస్తుతం లోక్ సభలో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎలా చూసుకున్నా వీటి సంఖ్య మరో నూటాభై నుంచి రెండు వందల దాకా పెరిగే సీన్ ఉంది.
అంటే 750 దాకా ఎంపీ సీట్లు పెరిగితే అందులో 250 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ఈ మహిళా సీట్ల రిజర్వేషన్ కి కూడా ఒక లెక్క ఉంది. అలా కొత్త ఎంపీ సీట్ల విభజనతో పాటు మహిళా కోటా వీటి విషయంలో చొరవ తీసుకుని ఎంతో కొంత తమకు అనుకూలం చేసుకోవడానికి అధికార పక్షానికే వీలు ఉంటుంది.
అంతే కాదు బలమైన పురుషులు ఉన్న నియోజకవర్గాలను మహిళా కోటా కింద మారిస్తే వారు కొత్త చోటు వెతుక్కోవాల్సిందే. అలాగే ఉన్న ఎంపీ సీటుని రెండుగా విభజించినపుడు తమకు బలం ఉన్న చోట్ల జాగ్రత్త పడి ప్రత్యర్ధులు బలంగా ఉన్న చోట్ల ఇబ్బందులు పెట్టేలా చూడవచ్చు. ఇవన్నీ రాజకీయ వ్యూహాలలో భాగంగానే ఉంటాయి.
ఇక ఆపరేషన్ సింధూర్ అన్నది కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక ఆయుధంగా ఉంది. దాంతో పాటు మరో రెండేళ్ళ వ్యవధిలో రక్షణ పరంగా కేంద్రం చేయాల్సిన పెద్ద పని చేస్తే కనుక సెంటిమెంట్ పూర్తిగా తమ వైపే తిరుగుతుందని కూడా భావిస్తున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలతోనే జమిలి ఎన్నికలకు ముహూర్తం పెడతారు అని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే 2027 చివరిలో దేశంలో జమిలి ఎన్నికలు జరగవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి విపక్షాన్ని కట్టడి చేయడం మరోసారి అధికార పగ్గాలు అందుకోవడం కోసం జమిలి మంత్రాన్ని వల్లిస్తున్న బీజేపీకి ఈ ప్రయోగం ఎంత వరకూ కలసి వస్తుందో.