బాధ్యతలు అప్పగించేస్తున్న జగన్ !
వైసీపీ అధినేత జగన్ సరికొత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన మూడు రాజధానులు అంటూ వికేంద్రీకరణ విధానం అని ఒక కొత్త పాలసీని అప్పట్లో ప్రచారం చేశారు.
By: Tupaki Desk | 29 April 2025 9:30 PM ISTవైసీపీ అధినేత జగన్ సరికొత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన మూడు రాజధానులు అంటూ వికేంద్రీకరణ విధానం అని ఒక కొత్త పాలసీని అప్పట్లో ప్రచారం చేశారు. అది వర్కౌట్ కాలేదు కానీ ఇపుడు చూస్తే జగన్ పార్టీలో వికేంద్రీకరణ విధానం తీసుకుని రావాలని చూస్తున్నారు.
వైసీపీలో దిగువ స్థాయి నుంచే పార్టీ ఎదగాలని వారే బాధ్యులుగా మారి సమర్ధంగా పనిచేయాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే నిన్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో చేసిన సూచనలు నేడు జిల్లా అధ్యక్షులు సమావేశంలో ఇస్తున్న దిశానిర్దేశం రెండూ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక జగన్ పార్టీని నాయకులకే అప్పగిస్తున్నారు అని అర్ధం అవుతుంది.
తాజాగా తాడేపల్లిలో జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ పార్టీకి జిల్లా అధ్యక్షులే సర్వస్వం అన్నారు మీరే పార్టీ పార్టీయే మీరు అని క్లారిటీగా చెప్పేశారు. మీరే అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ఎవరి కోసమో చూడవద్దు అని కూడా సూచించారు.
మీకు ఎవరైనా ఆదేశిస్తారేమో అని వేచి ఉండవచ్చు సొంతనా నిర్ణయాలు తీసుకోండి అని జగన్ ఫుల్ ఫ్రీడం ఇచ్చేశారు. జిల్లా పార్టీకి మీరే యజమానులు. మీ మాటే చెల్లుబాటు అవుతుంది. మీరే మొత్తం జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లూ ఒక ఎంపీ సీటూ గెలిపించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ తో కలుపుకుని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అసెంబ్లీ పరిధిలో రెండు వర్గాలు ఉంటే వారిని కో ఆర్డినేట్ చేసి సమస్యలు పరిష్కారం చూపాల్సింది మీరే అని అన్నారు.
అంతే కాదు బాగా పనిచేయని ఇంచార్జిల విషయంలో కూడా ఒకటికి పదిసార్లు పరిశీలన చేయడం వారు దారికి రాకపోతే మార్చేసే విషయంలోనూ మీదే కీలకమైన పాత్ర అన్నారు. పార్టీని గెలిపించడం అన్నది మీకు అతి ముఖ్యమని చెపారు.
జగన్ ఇంతలా వారి మీదనే ఎందుకు బాధ్యతలు మోపుతున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. పీఏసీ సభ్యులకూ ఇదే విధంగా సూచించారు. అలాగే జిల్లా అధ్యక్షుల విషయంలో ఈ విధంగానే చెబుతున్నారు. దీంతో జగన్ అధికారాలను వికేంద్రీకరించి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ దాకా తీసుకెళ్ళాలని అనుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది.
జగన్ తాను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి దగ్గర పడుతోంది. ఇక వైసీపీ ముఖ్య నేతల అరెస్టులు వరసబెట్టి జరుగుతున్నాయి. జగన్ దాకా కూడా ఈ అరెస్టులు రావచ్చు అన్న చర్చ సైతం సాగుతోంది దాంతో జగన్ అన్నీ చూసుకునే పార్టీని సమిష్టిగా నాయకులు అంతా కలసి నడిపే విధంగా ఈ విధంగా కొత్త రకమైన రూపుని అందిస్తున్నారని అంటున్నారు.
ఎవైనా అవాంతరాలు కలిగినా లేక ఇబ్బందులు వచ్చినా కూడా తన పరోక్షంలో సైతం పార్టీ ముందుకు సాగాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు గతంలో జగన్ జైలుకి వెళ్తే ఆయన సోదరి తల్లి కలసి పార్టీని జనంలోకి తీసుకుని వెళ్ళారు. ఇపుడు అలాంటి పరిస్థితి అయితే లేదని అంటున్నారు
వైసీపీలో జగన్ అరెస్ట్ అయితే పార్టీ పూర్తిగా ఇబ్బందులలో పడుతుంది అన్న ఒక భావన ఉంది. అది జగన్ కి తెలియనిది కాదని అంటున్నారు. అందుకే ఒకవేళ అలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడేలా క్యాడర్ బేస్డ్ గా లీడర్ ఓరియేంటెడ్ గా పార్టీని తీర్చిదిద్దలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ కొత్త రకమైన విధానం సక్సెస్ అయితే వైసీపీకి తిరుగు ఉండదు. అయితే చిక్కు అల్లా అందరికీ బాధ్యతలు ఇస్తే ఎవరు ఏమి చేస్తారో కూడా ఒక సందేహమే అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినాయకత్వంలో కొత్త భయాలు ఉన్నాయని వాటిని అధిగమించేందుకు పార్టీని సరికొత్తగా డిజైన్ చేసేలా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.