Begin typing your search above and press return to search.

మళ్ళీ జగన్ వర్సెస్ పవన్!

ఇక పవన్ సైతం జగన్ మీద విమర్శలు చేయడం లేదు. ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 9:47 AM IST
మళ్ళీ జగన్ వర్సెస్ పవన్!
X

ఏపీలో జగన్ వర్సెస్ పవన్ అన్న ఎపిసోడ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా 2019 నుంచి 2024 మధ్య దాకా సాగింది. ఆనాటి సీఎం జగన్ ని ప్రతిపక్షంలో ఉన్న పవన్ విమర్శిస్తూ ఉండేవారు. ఆయన వారాహి సభలతో పాటు జిల్లాల పర్యటనకు చేస్తూ ఎక్కడికక్కడ జగన్ పాలనను ఎండగడుతూ ఉండేవారు.

అంతే కాదు జగన్ ఆయన మంత్రుల మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉండేవారు. జగన్ నే నేరుగా పవన్ సవాల్ చేసేవారు. ఎన్నికల్లో జగన్ పార్టీని పాతాళానికి నెడతాను అని కూడా ఆవేశంతో ఊగిపోయేవారు. నిజానికి అదే జరిగింది. జగన్ ఘోరంగా ఓటమి పాలు అయ్యారు.

ఇక గడచిన ఏడాదిగా చూస్తే ఏపీలో రాజకీయ రచ్చ పెద్దగా లేదు. దానికి కారణం జగన్ జనంలోకి రాకపోవడమే. అయితే కూటమి పాలనకు ఏడాది కాలం ముగిసిందో లేదో జగన్ జనంలోకి వస్తున్నారు. ఆయన వరసబెట్టి పర్యటనలు చేస్తున్నారు. ఆయన సభలలో జన సందోహం కనిపిస్తోంది. దాంతో పాటు జగన్ కూడా అధికార కూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.

పోలీసుల మీద కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తప్పులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంత దూరంలో ఉన్నా వెనక్కి తెచ్చి మరీ శిక్షిస్తామని జగన్ వార్నింగులు ఇస్తున్నారు. అదే సమయంలో ఆయన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. ఆయన ఎంతసేపూ చంద్రబాబుని లోకేష్ నే టార్గెట్ చేస్తున్నారు.

ఇక పవన్ సైతం జగన్ మీద విమర్శలు చేయడం లేదు. ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో అయితే పవన్ పూర్తి మౌనంగా ఉంటున్నారు. దాంతో ఆయన మౌనం వెనక అర్థాలు పెడార్ధాలు తీస్తూ ప్రచారం చేసేవారూ ఉన్నారు.

అయితే జగన్ పవన్ని విమర్శించకపోవడం పవన్ మౌనంగా ఉండడంతో దీని మీద కూడా ఎవరికి తోచిన తీరున వారు రాజకీయ కధనాలు అల్లుకుంటున్నారు. పవన్ కూటమి ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్నారని అందుకే మౌనమని కూడా వ్యాఖ్యానించేవారు కూడా ఉన్నారు. జగన్ కూడా చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు తప్ప పవన్ ని చేయకపోవడం వెనక ఏమైనా విషయం ఉందా అని లోతుగా విశ్లేషించేవారూ ఉన్నారు.

అయితే ఈ రకమైన ఊహాగానాలకు ప్రచారాలకు చెక్ పెడుతూ పవన్ పూర్వం మాదిరిగానే వైసీపీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన తనదైన భాషలోనే వైసీపీకి సందేశాన్ని పంపించారు. తొక్కి నార తీస్తామని మక్కెలు విరగగొట్టి కూర్చోబెడతామని పవన్ మూడవ కన్ను తెరచారు. అంతే కాదు కూటమి ఐక్యతకు తాను ప్రాధాన్యత ఇస్తాను అని ఇరవయ్యేళ్ళూ కూటమే ఉంటుందని కూడా స్పష్టం చేశారు.

ఈ పరిణామాల నేపధ్యంలో రేపటి రోజున జగన్ వైపు నుంచి పవన్ మీద హాట్ కామెంట్స్ ఉంటాయా అన్న చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే గతంలో పవన్ ని వ్యక్తిగతంగా కూడా వైసీపీ నేతలు విమర్శించారు ఇపుడు మళ్ళీ జగన్ వర్సెస్ పవన్ డైలాగ్ వార్ స్టార్ట్ అవుతుందా అని అంతా ఆలోచిస్తున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఏపీ రాజకీయాలు ఎన్నికలకు నాలుగేళ్ళ ముందే వేసవి వేడిని నిండుగా తలపిస్తాయనడంలో సందేహం లేదు.