Begin typing your search above and press return to search.

మోడీ తోనే జగన్ కి హాట్ లైన్ !

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాంగ్రెస్ ని కెలికారు. అది అవసరమా అనవసరమా అన్నది పక్కన పెడితే దాని ఫలితం అయితే గట్టిగానే రివర్స్ లో వచ్చేసింది.

By:  Satya P   |   14 Aug 2025 12:19 AM IST
మోడీ తోనే జగన్ కి హాట్ లైన్  !
X

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాంగ్రెస్ ని కెలికారు. అది అవసరమా అనవసరమా అన్నది పక్కన పెడితే దాని ఫలితం అయితే గట్టిగానే రివర్స్ లో వచ్చేసింది. తెలంగాణా నుంచి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నాయకుల వరకూ జగన్ కి మోడీ అమిత్ షాలతోనే పక్కాగా హాట్ లైన్ ఉందని అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అయితే జగన్ కోసం ఒక వీడియో బైట్ ని వదిలారు. అందులో జగన్ ను నిశితంగా విమర్శించారు.

రాహుల్ పోరాటం అది :

మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా దేశం కోసం ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని మాణిక్కం ఠాగూర్ అన్నారు సొంతం కోసం ఆయన పోరాటం చేయడం లేదని అన్నారు. మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో జగన్ సత్తా ఉంటే చేతులు కలపాలని ఆయన కోరారు. అంతే కానీ రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయవద్దు అని జగన్ కి సూచించారు.

మీరంతా ఒక్కటేగా :

ఏదో ఊహించుకుని జగన్ మాట్లాడుకోవడం మానుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు మోడీ ఇద్దరూ ఒకే గూటిలో ఉన్న సంగతి తమకు బాగా తెలుసు అన్నారు. అలాంటి బాబుతో రాహుల్ కి ఎలా జత కడతారు అని ప్రశ్నించరు. అంతే కాదు పవన్ మోడీ ఒక్కటే, అలాగే జగన్ మోడీ కూడా ఒక్కటే అని మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. ఈ మాట ఏపీలోని ప్రజలు అందరికీ తెలుసు అన్నారు. అది కాదు అని నిరూపించుకోవాలంటే విజయవాడలో ఈ నెల 14న షర్మిల ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ ర్యాలీలో జగన్ పాల్గొని మోడీకి వ్యతిరేక గళం వినిపించాలని కోరారు.

తీవ్రంగా స్పందించిన ఎంపీ :

మరో వైపు తెలంగాణా సీఈం రేవంత్ రెడ్డిని చంద్రబాబుని కలిపి జగన్ విమర్శించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగానే స్పందించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన తిప్పికొట్టారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి వల్లే రాహుల్ గాంధీ ఏపీ గురించి మాట్లాడలేదని ఆరోపించడం ఏ మేరకు సబబు అని జగన్ ని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందినా కూడా జగన్ ఆలోచనా విధానం మారలేదని విమర్శించారు .ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఏమైనా తప్పులు జరిగినట్లు భావిస్తే ఎన్నికల కమిషన్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించాలి కానీ రాహుల్ ని ఎందుకు తప్పుపడతారు అని నిలదీశారు.

అటు తిరిగి ఇటు తిరిగి :

మొత్తం మీద చూస్తే ఈ హాట్ లైన్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి జగన్ మీదకే వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. జగన్ మోడీ అమిత్ షాలతో కలసి ఉంటున్నారు ఆయన మద్దతు లోపాయికారిగా బీజేపీకి అన్నది కాంగ్రెస్ నాయకులు బయటపెడుతున్నారు. దీంతో రాహుల్ బాబు హాట్ లైన్ అంటూ జగన్ చేసిన విమర్శలు బూమరాంగ్ అయ్యాయా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.