విజయమ్మను కౌగిలించుకున్న జగన్... మాట్లాడుకోలేదు ఎందుకు?
గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు.. తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మతో మంచి సంబంధాలు లేవనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2025 3:10 PM ISTగత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు.. తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మతో మంచి సంబంధాలు లేవనే సంగతి తెలిసిందే. విజయమ్మకు గతంలో కేటాయించిన వాటాలను తిరిగి పొందాలని కోరుతూ ఆయన ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం, దీనికి ఆమె నుంచి కౌంటర్ రావడం జరిగింది! ఆ విధంగా ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందని చెబుతున్నారు!
ఒకానొక సమయంలో అయితే వ్యవహారం పూర్తిగా పబ్లిక్ అయిపోయింది! షర్మిల అయితే జగన్ ను నేరుగానే టార్గెట్ చేస్తున్నారు.. బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు విజయమ్మకు జగన్ కు మధ్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందనే విషయంపై పూర్తి స్పష్టత లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు తాజాగా కలుసుకున్నారు.. ఆలింగనం చేసుకున్నారు! అయితే... అక్కడ ఉన్నంత సేపు ఇద్దరి మధ్య మాటలు కనిపించలేదు!
అవును... ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వీరితోపాటు వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... జగన్, విజయమ్మ ఆలింగనం చేసుకున్నారు!
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. వారు దగ్గరగా ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకొన్నట్లు కనిపించలేదు! దీంతో... ఈ నిశ్శబ్ధ సంభాషణ వారి మధ్య ఉన్న గ్యాప్ ను, దెబ్బతిన్న సంబంధాలను ప్రతిబింబిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
మరోవైపు అక్కడి వాతావరణం అంతా తీవ్ర భావోద్వేగం మధ్య ఉండటంతో.. మాటాడుకోలేకపోయి ఉండొచ్చు అని మరికొంతమంది స్పందిస్తున్నారు. ఏది ఎమైనా.. వీరి మధ్య బంధం అప్పటిలా లేదనే వాదనకు తాజా సంఘటన ఒక నిదర్శనం అనే మాటలు వినిపిస్తుండటం గమనార్హం!
మరోవైపు... వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా విజయమ్మతో కలిసి షర్మిల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు కేక్ తినిపించుకోగా.. షర్మిలను విజయమ్మ ఆప్యాయంగా ముద్దాడారు!